6 June, 2026 | 9:02 PM

దమ్మపేట పంచాయతీలో గ్రామసభ

06-06-2026 07:58 PM

దమ్మపేట పంచాయతీని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దే బాధ్యత నాదే ఎంఎల్ఎ జారే

దమ్మపేట,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా దమ్మపేట పంచాయతీ గ్రామ సభ సర్పంచ్ పగడాల రమాదేవి అధ్యక్షతన జరిగింది. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ దమ్మపేట పంచాయతీని చేస్తున్న సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దే బాధ్యత తనదని, అందులో భాగంగా సెంట్రల్ లైటింగ్తో డివైడర్ ఏర్పాటు చేశామని, డ్రైనేజీ ఆక్రమణలు తొలగించి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళే విధంగా ఫుట్ పాత్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

రామ్జీ కుంటను సుందరంగా తీర్చిదిద్ది పార్కుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. లైబ్రరీ బిల్డింగ్ కోసం త్వరలోనే వారం లోపులోనే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తామని, క్రీడ ప్రాంగణం కోసం స్థల పరిశీలన జరుగుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా పరిశుభ్రత పాటిస్తూ, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని, ఎంతో ఖర్చు చేసి సి సి రోడ్లు నిర్మిస్తుంటే ఎవరికి వారు వీదుల్లో కనీసం ఇంటిముందు ముగ్గు వేసుకోలేకపోతున్నారని, ప్రతి వీధిలో, ప్రతి ఇంటిముందు ముగ్గులు వేసుకుంటే అక్కడ చెత్త వేయాలనే ఆలోచన రాదని, అప్పుడు మన వీధి, మన గుమ్మం చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుందని తెలిపారు. 

వీధుల్లో రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ ఇసుక, కంకర వేస్తున్నారని, అలాంటివారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని పంచాయతీ కార్యదర్శి కి సూచించారు. జలవాగు, మల్లారం కాలనీలో బి టి రోడ్లను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి గ్రామసభను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. గ్రామ సభ కేవలం సమావేశాలు కాకుండా గ్రామాల భవిష్యత్ అభివృద్ధికి మార్గదర్శక వేదికలుగా నిలవాలని పేర్కొన్నారు.

అనంతరం కార్యదర్శి బండి అనంత్ కుమార్ మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్దేశించిన త్రాగునీటి సరఫరా, వర్షాకాల సన్నద్ధత, ఘన వ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ మొక్కల పెంపకం, వన సంరక్షణ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, వరదలు మరియు విపత్తుల నిర్వహణ అనే 7 అంశాలతో కూడిన సమగ్ర వివరాలను చదివి ప్రజలకు వినిపించారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పరిష్కరిస్తున్న సమస్యలకు ప్రజల సహకారం కావాలన్నారు. ఒక్క పంచాయతీ సిబ్బందితో గ్రామ పారిశుధ్యం చేయలేమని ప్రతీ ఒక్కరూ బాధ్యతతో సిబ్బందికి సహకరిస్తే శాశ్వత పరిష్కారం ఏర్పడుతుందన్నారు.