11 July, 2026 | 2:10 AM

బంజారాలకు తీవ్ర అన్యాయం

11-07-2026 12:00 AM

రవీంద్ర నాయక్ :

* భారతదేశ చరిత్రలో బంజారా సమాజానికి విశిష్ట స్థానం కలిగి ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలు లేని కాలంలో అడవులు, కొండ ప్రాంతాలను దాటి ప్రజలకు ఉప్పు, ధాన్యం, నిత్యావసర వస్తువులు, గన్ పౌడర్, యుద్ధ సామగ్రి తదితర సరుకులను చేరవేస్తూ బంజారాలు విశేష సేవలు చేశారు.

బంజారాల కార్వాన్లు విడిది చేసే ప్రాంతాలలో ప్రజల సౌకర్యార్థం మంచినీటి వనరులు, ధర్మశాలలు నిర్మించే వారు. ఈ చారిత్రాత్మక సేవలను భారతదేశ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పాలనలో బంజారాలకు కొంతవరకు న్యాయం జరిగింది. కానీ, ప్రస్తుతం బంజారాలకు దేశంలో నామమాత్రంగా అయినా గుర్తింపు లభించకపోవడం బాధాకరం.

* దేశానికి స్వాతంత్య్రం లభించి 8 దశాబ్దాలు పూర్తయినా నేటికీ బంజారాలు అనేక కష్టాలు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. దేశంలోని ప్రతి బంజారా కుటుంబం విద్య, ఉపాధి, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన, సాంస్కతిక గౌరవం, సమాన రాజకీయ అవకాశాలతో అభివృద్ధి చెందేలా చూడాలి.విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను విస్తరించాలి. మహిళలు, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. తండాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించాలి. 

స్వాతంత్య్ర ఉద్యమ సమయం లో బ్రిటిష్ వారికి లొంగకుండా, వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినందున బంజారాలను నేర జాతి (క్రిమినల్ ట్రైబ్స్)గా ముద్రవేశారు. ప్రప్రథమ భారత ప్రధాని నెహ్రూ పదవి చేపట్టిన వెంటనే ఆ ముద్రను చెరిపివేసి, బంజారాలను కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలుగా, డీనోటిఫైడ్ ట్రైబ్స్‌గా గుర్తించారు. వారి పురోగతికి పంచశీల సూత్రాలను అమ లు చేశారు. అయితే, అంబేద్కర్ నాయకత్వాన రచించిన రాజ్యాంగంలో తెలంగాణ (నిజాం పాలన వల్ల)తోపాటు కొన్ని రాష్ట్రా ల్లో బంజారాలు ఎస్సీ/ఎస్టీలుగా గుర్తింపు పొందలేకపోయారు.

తెలంగాణ బంజారాలకు 20 ఏళ్లుగా జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా 1969లో అప్పటి తెలంగాణ విద్యార్థి సమితి ఉద్యమకారుడు, మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వడ్త్య రవీంద్రనాయక్ నాయకత్వంలో తెలంగాణ లంబాడీ, బంజార, ఎరుకల తెగలను ఎస్టీలుగా గుర్తించాలని ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమ ఫలితంగా తెలంగాణ లంబాడీ, బంజారా, ఎరుకల వారికి జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ‘బంజార మాత’ నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1976లో 108/ 1976 పార్లమెంట్ యాక్ట్ ద్వారా బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చారు.

దేశానికి ఎనలేని సేవలు

మన దేశంలో ఇద్దరు బంజారా నేతలు కాకా సాహెబ్ వి.పి నాయక్, సుధాకర్‌రావు నాయక్ మహారాష్ట్ర ముఖ్యమంత్రులుగా సేవలందించారు. ఈ క్రమంలో హరిత మహారాష్ట్రగా తీర్చిదిద్ది బంజారాల పరిపాలనా దక్షతను నిరూపించారు. కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేటీ రాథోడ్ బంజారా పనిచేశారు. సుధాకర్‌రావు నాయక్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. ఎల్‌ఆర్ నాయక్ లండన్ కమిషనర్‌గా, మండల కమిషన్ సభ్యులుగా పనిచేశారు.

డిప్యూటీ మిని స్టర్ హోదాలో జాతీయ ఎస్సీ, ఎస్టీల కంబై న్డ్ కమిషన్ సభ్యునిగా రవీంద్ర నాయక్ పనిచేశారు. ప్రస్తుత ఎంపీ పొరిక బలరాం నాయక్ కేంద్రమంత్రిగా పని చేశారు. కానీ, ఈరోజు దేశంలో బంజారాలకు సరైన స్థా నం లేకుండాపోయింది. ఆనాడు దేశంలో విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు అన్నివిధాల సహాయ సహకారాలు అందించిన బంజారాలు నేడు బతుకు జీవుడా అంటూ అలమటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో దీనిపై బంజారాలు ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేస్తూ, హిందువులను కాపాడ టానికి లక్కీషా బంజార, మక్కన్ షా లభాన చేసిన పోరాటాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేవడానికి ‘ఆవో బంజార, వజావో నంగార, జగావో బంజార’ పేరిట 2026 ఆగస్టు మొదటివారంలో బంజార భారత్ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నది. ఢిల్లీలోని లక్కీషా బంజార హాల్, రకాబ్ గంజ్ గురుద్వారాలో బంజార భారత్ కోర్ కమిటీ ఈ కింది విషయాలను చర్చించడానికి సమావేశమవుతుంది.

సమాన హక్కులు ఎక్కడ?

రాజ్యాంగంలో అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు కల్పించినప్పటికీ, దేశంలోని వివిధ రాష్ట్రాలలో బంజారా సమా జానికి సమాన అవకాశాలు ఇంకా అందడం లేదు. స్వాతంత్య్రం తర్వాత వివిధ ప్రభుత్వాలు గిరిజన సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను బంజారా సమాజం కృతజ్ఞతతో గుర్తిస్తుంది. ముఖ్యంగా సమగ్ర గిరిజన అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి చర్య లు బంజారా సమాజానికి ఉపయోగపడ్డాయి. 60 సంవత్సరాల పోరాటం, వందల మంది యువకుల ప్రాణ త్యాగాలను గుర్తిం చి తెలంగాణను ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి సోనియమ్మకు, కాంగ్రెస్ పార్టీకి బంజార భారత్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.

స్వరాష్ట్రంలో అభివృద్ధి జరిగినా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గిరిజన సంక్షేమం, తండాల అభివృద్ధి, గిరిజన రిజర్వేషన్లు, సంక్షేమ కార్యక్రమాల అమ లుకు చేపట్టిన చర్యలను బంజార భారత్ స్వాగతిస్తున్నది. అయితే, దేశవ్యాప్తంగా లక్షలాది మంది బంజారాలు విద్య, ఉపాధి, ఆరోగ్యం, రాజకీయ ప్రాతినిధ్యం, భూ హ క్కులు, ఆర్థికాభివృద్ధి వంటి అనేక రంగాల్లో ఇంకా వెనుకబడి ఉన్నారు. కనుక చారిత్రకంగా దేశానికి సేవలందించిన ఈ సమాజం అభివృద్ధి అత్యవసరం.

ఢిల్లీ సమావేశానికి తరలిరావాలి

ఈ నేపథ్యంలో ‘బంజార భారత్’ తరఫున ఈ కింది అంశాలను కేంద్రం దృష్టికి తీసుకొస్తూవెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. స్వాతంత్య్రానికి పూ ర్వం సంచార జీవితం గడుపుతూ ఆకాశమే తమ గూడుగా బంజారాలు బతికారు. ఎడ్లబండ్లు, గుర్రాలు, ఒంటెలపై వ్యాపారాలు చే స్తూ అన్ని జాతులు, తెగలు, మతాలకతీతం గా సోదర స్వభావంతో జీవనం సాగించారు. 

అయితే, దేశానికి స్వాతంత్య్రం లభించి 8 దశాబ్దాలు పూర్తయినా నేటికీ బంజారాలు అనేక కష్టాలు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. బంజారాలపై నేర జాతిగా ము్ర దవేసిన బ్రిటిష్‌వారు అంతటితోనే ఆగకుం డా ఢిల్లీలోని ప్రదాన కూడలిలో ఉన్న రాయసీన హిల్స్‌లోని బంజారాల తండాలకు చెందిన 1250 ఎకరాల భూములు, ప్రస్తుత రాష్ట్రపతి భవన్, నార్త్, -సౌత్ ఎంపీ నివాసాలు, నార్త్, సౌత్ బ్లాక్‌లు, సెంట్రల్ ఆఫీసు లు, పార్లమెంట్ భవన సముదాయాలు, బోట్స్ క్లబ్, ఇండియా గేట్, హైదరాబాద్ హౌస్, జంతర్‌మంతర్ ప్రాంతాలతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లోని భూములను బలవంతంగా లాక్కున్నారు.

సదరు భూములకు బదులుగా భారత ప్రభుత్వం ఢిల్లీలో లేదా పరిసరాల్లో భూములను కేటాయించాలి. దేశంలోని ప్రతి బంజారా కుటుంబం విద్య, ఉపాధి, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన, సాంస్కతిక గౌరవం, సమాన రాజకీయ అవకాశాలతో అభివృద్ధి చెందేలా చూడాలి.

విద్యాభివృద్ధికి కృషిచేయాలి

అదే సమయంలో రాజ్యాంగబద్ధమైన హక్కులు అన్ని రాష్ట్రాల్లో సమానంగా అమలయ్యేలా కృషి చేయాలి. విద్య, నైపు ణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను విస్తరించాలి. మహిళలు, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. తండాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించాలి. బంజారా సమాజానికి సంబంధించిన చారిత్రక పరిశోధనలకు మద్దతి వ్వాలి.

దేశవ్యాప్తంగా బంజారా సంఘాల మధ్య ఐక్యతను బలోపేతం చేయాలి. ప్రజాస్వామ్య సంస్థల్లో బంజారా సమాజానికి తగిన ప్రాతినిధ్యం కోసం రాజ్యాంగబద్ధ మార్గాల్లో కృషి చేయాలి. సామాజిక న్యాయం, సమానత్వం, జాతీయ సమైక్యతకు అంకితభావంతో పనిచేయాలి. బంజా రా సమాజ అభివృద్ధిపై జాతీయ స్థాయి సమగ్ర అధ్యయనం చేపట్టాలి.

సంస్కృతిని పరిరక్షించాలి

తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి. 500-1000 మంది జనాభా ఉన్న తండా, డేరా, నగ్లాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, ఉపకార వేతనాలు అందించాలి. ఆడపిల్లల డ్రాపౌట్స్‌ను నివారించడానికి వారి తల్లిదం డ్రులకు ప్రోత్సాహకంగా స్కాలర్‌షిప్ ఇవ్వా లి.

బంజారా సంస్కృతి, భాష, జానపద కళలను పరిరక్షించడానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలో బంజార కల్చరల్, సోషల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలి. బంజారాహిల్స్‌లో కబ్జాకు గురైన 750 ఎకరాల భూమిని బంజారాల అభివృద్ధికి కేటాయించాలి. ఏపీలోని తిరుమలలో భగవాన్ హాతిరాం బంజార బాబాకు చెందిన కబ్జాకు గురైన వందలాది ఎకరాల భూములను బంజారాల అభివృద్ధికి ఉపయో గించాలి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం బంజార భాష ‘గోర్ బోలి’ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసింది. పార్లమెంట్‌లో వెంటనే దాన్ని ఆమోదించాలని బంజార భారత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.

 వ్యాసకర్త: మాజీ మంత్రి