ఆకలి తీర్చిన ఆపిల్ పండు
ఆచార్య మసన చెన్నప్ప :
* ఆకలి దంచేస్తుంది. ఇంకా తెల్లవారడానికి 6 గంటల టైముంది. ఆ తర్వాత విమానమెక్కి హైదరాబాద్ చేరడానికి ఎంత సమయం పడుతుందో! అని ఆలోచిస్తేనే భయం కలిగింది.
అది కరోనా సమయం. కరోనా ప్రపంచాన్ని భయపెడుతుందని ఊహించక అమెరికా వెళ్లాను. అక్కడ ఆర్నెల్లు మా అమ్మాయి శ్రావణి ఇంట్లో ఉన్నాను. కిటికీ అద్దాల గుండా బయటికి చూడడం తప్ప తలుపులు తెరిచి వెలుపలి దృశ్యాన్ని చూసే పరిస్థితి లేదు. ఒక విధంగా నేరం చెయ్యని ఘోరమైన జైలు జీవితం! ఏం తింటే ఏమవుతుందో అనే భయం. తినాలనే కోరిక చంపుకొని ఆర్నెల్లు ఎట్లాగో గడిపి ఇండియాకు బయల్దేరాను.
అతికష్టం మీద వందేభారత్ విమానంలో చిట్టచివరి టికెట్టు దొరికింది. ఒక లక్షా డ్బుభై వేలు పెట్టి టికెట్టు కొనుకున్నాను. అయితే, వందేభారత్ ఎయిరిండియా సౌకర్యం నేనున్న లాస్‌ఏంజిల్స్ నుంచి లేదు. ఎనిమిది గంటలు లాస్‌ఏంజిల్స్ నుంచి కారులో శాన్‌ఫ్రాన్సిస్కో చేరి, ఆ రాత్రి బంధువుల ఇంట్లో ఉన్నాను.
కరోనా సమయంలో ఒకరిని మరొకరి ఇంటికి రానిచ్చే పరిస్థితి లేదు. అయినా ధైర్యం చేసి మా ప్రియమైన బంధువు బాలె రాజన్న కోరిక మేరకు వారి కుమారుడు శ్రీధర్ ఇంటికి అతిథిగా వెళ్లాను. నాతోపాటు మా అల్లుడు నాగరాజు, మిత్రుడు కిరణ్ ఉన్నారు. ఆ రోజు రాత్రి కడుపునిండా తిని చక్కగా విశ్రాంతి తీసుకున్నాను. ఉదయం ఎయిర్‌పోర్టుకు వెళ్లిన తర్వాత తెలిసింది హైదరాబాద్‌లో కరోనా బాధితులు హోం క్వారంటైన్‌లో ఉండవచ్చని. ఎయిర్‌పోర్టుకు బయల్దేరేముందు కొద్దిగా అల్పాహారం తీసుకున్నట్టు గుర్తుంది. అమ్మాయి శ్రావణి విమానంలో నాకు తోడుగా ఉండే బ్యాగులో ఏం పెట్టిందో నాకు తెలియదు. కానీ, దాన్ని విడువకుండా నా దగ్గరే పెట్టుకున్నాను. కానీ, భయపడి, పెద్ద బ్యాగులు రెండూ విమాన సిబ్బందికి ఇవ్వకుండా మా అల్లునికిచ్చి పంపించాను, లగేజీ భారమని.
కరోనా భయపెడుతుంటే, ఎప్పుడు ఇంటికి రావాలన్న ఆలోచనే గాని, ఆ బ్యాగులను వెంట తీసుకొని రాగలిగిన ఓపిక నాలో లేకుండాపోయింది. అందుకే అలా చేయాల్సి వచ్చింది.
విమానంలో 16 గంటలు ప్రయాణం చేసి ఢిల్లీలో దిగాను. శాన్‌ఫ్రాన్సిస్కోలో విమానం ఎక్కేటప్పుడు కరోనా పరీక్షను ఎదుర్కొన్నాను. నెగిటివ్ రావడం వల్ల బతికిపోయాను. తిరిగి ఢిల్లీకి వచ్చిన తర్వాత అక్కడ సర్టిఫికెట్ తీసుకొని గాని హైదరాబాద్‌కు రాలేని పరిస్థితి. సాయంత్రం 4 గంటల పాటు నాకు పరీక్ష! ఢిల్లీ పోలీసులు నెగిటివ్ సర్టిఫికెట్ ఇచ్చి ఆ రాత్రికి బస చేసి పొద్దున్నే విమానం ఎక్కమన్నారు. విమానంలో నేను భయంభయంగానే ఉన్నాను. ఏం తిన్నానో, ఏం తాగానో నాకే తెలియదు. ఆకలిని చంపుకొని రోజంతా ఉండవలసిన దుస్థితి! నచ్చిన వంటకం ఇంట్లో లభిస్తుంది, విమానంలో లభిస్తుందా?
ఢిల్లీలో విమానం దిగిన తర్వాత ఆకలి దంచివేస్తున్నది. బయటికి వెళ్లి తినే పరిస్థితి లేదు. నాకు కనిపించిన టీ స్టాల్‌లో ఏమైనా తినడానికి ఉందా? అని అడిగాను. బిస్కట్లు మాత్రమే ఉన్నాయని స్టాల్ వాడు చెప్పాడు. ఒక ప్యాకెట్ కొని, టీ తాగాను. అయినా ఆకలి తీరలేదు. విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆ రాత్రంతా గడపాలన్న ఆలోచన రాగానే భయమేసింది. ఉదయం ఆయా నగరాలకు వెళ్లవలసిన ప్రయాణికులతో ఢిల్లీ విమానాశ్రయంలోని విశ్రాంతి భవనం నిండిపోయింది. ఒకరి పక్కన ఒకరు కూర్చోవడానికి భయం. పడుకుందామంటే అంత చోటు లేదు. సోఫాలో ఎంతసేపని కూర్చోగలం! కింద నేలమీద కొందరు పడుకొని సెల్‌ఫోన్లతో ఆనందిస్తున్నారు. కొందరిని చూస్తే ‘కరోనా మమ్మల్ని ఏం చేస్తుంది?’ అనే ధైర్యంతో ఉన్నట్టు తోచింది. నాకు మాత్రం అంతులేని భయం.
నిజానికి ఒక్క రోజు ఆకలితో నాకు ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆకలి తీరడానికి ఎన్ని నీళ్లని తాగగలం. శరీరం వశంలో లేదు. మనస్సు మాత్రం ‘తెల్లవారిందాకా ఓపికతో ఉండు’ ఇంటికి చేరగలవు అని ధైర్యం ఇస్తున్నది.
కూర్చున్నా, పడుకున్నా నిద్రరాదు. ఆకలి నిద్ర ఎరుగదు అన్న సామెత నా పట్ల రుజువైంది. ఆకలి అనేది లేకుంటే బాగుండు! దేవుడు అన్నీ ఇచ్చి, ఆకలిని కూడా ఇచ్చాడు. సమయానికి ఏదైనా కడుపులో పడకపోతే ప్రాణం పోయినంత పనవుతుంది. బహుశా అప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలవుతుండవచ్చు! ఆకలి మనిషిని రాక్షసుణ్ని చేస్తుందట! నిజమే కావచ్చు. అందుకే దేవుణ్ని ఆకలిదప్పులు లేని అమరత్వాన్ని కోరుకుంటారు మానవులు. నేను దేవలోక వాసినైతే అమృతం మాత్రమే తాగి ఉండేవాణ్ని కదా. కానీ, అక్కడ కూడా పోటీ లేదని చెప్పగలమా! ఆకలి దంచేస్తుంది. ఇంకా తెల్లవారడానికి 6 గంటల టైముంది. ఆ తర్వాత విమానమెక్కి హైదరాబాద్ చేరడానికి ఎంత సమయం పడుతుందో! అని ఆలోచిస్తేనే భయం కలిగింది.
ఇక ఆకలిని భరించలేని స్థితిలో మా అమ్మాయి శ్రావణి గుర్తుకువచ్చింది. ‘ఆకలైతే ఈ ఆపిల్ పండు తిను నాన్నా!’ అని ఒక పండు నా చేతి బ్యాగులో పెట్టినట్టు జ్ఞాపకం! ఇంకేం వెంటనే నా చేతి బ్యాగును తెరిచిచూశాను. ఆపిల్ పండు కనిపించింది. పోయిన ప్రాణం తిరిగివచ్చింది. పండు పెద్ద గా ఎర్రగా ఉంది. బహుశా అది నా పాలిటి దేవత! ఆకలిని పోగొట్టే అమ్మ! నా కోసం ఎదురుచూస్తున్నదా అన్నట్టు కనిపించే ఆపిల్‌ను నీళ్లతో కడిగి, ఆరగించాను తృప్తిగా.
నా జీవితంలో ఆకలితో గడిపిన రోజులు లేకపోలేదు. ఒక పది సంవత్సరాలు మాత్రమే ఊళ్లో అమ్మచేతి వంటను రుచి చూసినవాణ్ని. ఆరు నుంచి పదవ తరగతి వరకు నల్గొండ జిల్లాలోని చింతపల్లిలో చదువుకునేటప్పుడు ఉపవాసం చేసిన రోజులెన్నో ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో అయితే చెప్పవలసిన పని లేదు. కానీ, అమెరికా లాంటి పెద్ద దేశానికి వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో ఒక్క రోజు ఆకలితో బాధపడిన ఉదంతం విస్మరించరానిది.
వ్యాసకర్త సెల్: 9885654381






