దేవుని సొమ్ముకే కక్కుర్తి
- పారుపల్లి మల్లికార్జున స్వామి గుడిలో దారుణమైన చోరీ
- పాపాత్ములారా.. దేవుని దయ కంటే మీ దురాశే ఎక్కువైందా?
ముత్తారం, జూన్ 14 (విజయ క్రాంతి)ముత్తారం మండలం పారుపల్లిలోని శ్రీ ఆది మల్లికార్జున స్వామి ఆలయంలో జరిగిన చోరీ ఘటన, మనుషుల నైతిక పతనాన్ని మ రోసారి కళ్ళకు కట్టింది. భక్తితో భక్తులు సమర్పించుకున్న కానుకలను, దేవుని హుండీనే బద్దలుగొట్టి దొంగిలించిన ఆ దు ర్మార్గుల చర్యపై స్థానికంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.రాత్రిపూట చీకటిని ఆసరాగా చేసుకుని, పవిత్రమైన ఆలయంలోకి ప్రవేశించి ఈ నీచానికి ఒడిగట్టిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.
భక్తుల మనోభావాలతో ఆడుకుంటే.. పతనం తప్పదు
కేవలం పైసల కోసం భక్తుల విశ్వాసాలను, ఆలయ పవిత్రతను దెబ్బతీసే ఇలాంటి నీచమైన పనులకు పాల్పడే వారికి దైవశిక్ష తప్పదని, దేవుని సొమ్మును కాజేసిన ఈ పాపాత్ములకు ఏ మాత్రం భయం, భక్తి లేదన్నది స్పష్టమవుతోంది. అమాయక భక్తులు వేసిన చిల్లర పైసల మీద కూడా కన్ను పడిందంటే, మీ దౌర్భాగ్యపు బతుకులు ఏ స్థాయికి పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు‘ అని గ్రామస్థులు మండిపడుతున్నారు.
దొంగలకు హెచ్చరిక: దాగినా దొరుకుతారు!
కులపెద్దలు, భక్తులు ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారు. చోరీకి పాల్పడిన ఆ ’నీచులు’ ఏ మూలన దాక్కున్నా సరే, గ్రామ ప్రజలు, పోలీసులు కలిసి వెతికి పట్టుకు తీరాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
డిమాండ్
పవిత్రమైన ఆలయాల్లో ఇలాంటి అరాచకాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే, ఈ దొంగలను వెంటనే పట్టుకుని, కఠినంగా శిక్షించాలని, చట్టం ముందు, సమాజం ముందు మీ నిజస్వరూపాలు బయటపడక తప్పదని,ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, దొంగలను వెతికి పట్టుకునే వరకు భక్తులు నిద్రపోరని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.






