15 July, 2026 | 5:04 AM

అమెరికాలో చదివితే గ్రీన్‌కార్డు

22-06-2024 12:05 AM

డిగ్రీ పూర్తికాగానే శాశ్వత నివాస వీసా

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

ఇదంతా ఎన్నికల జిమ్మిక్కేనని విమర్శలు  

న్యూఢిల్లీ, జూన్ 21 : అమెరికాలో విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులకు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తాను మళ్లీ అధ్యక్షుడైతే అమెరికా యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసే విదేశీ విద్యార్థులకు వెంటనే గ్రీన్ కార్డులు ఇస్తానని ప్రకటించారు. అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు విదేశీయులకు ఈ గ్రీన్ కార్డులు జారీచేస్తారు. వీటికోసం కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నారు. పదేండ్ల నుంచి ఎదురుచూస్తున్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు చదువు అయిపోగానే నేరుగా గ్రీన్‌కార్డు ఇవ్వాలని ట్రంప్ ప్రతిపాదించటం సంచలనంగా మారింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగానే విదేశీ విద్యార్థులు ఇక్కడే ఉండేందుకు వీలుగా సర్టిఫికేట్‌తోపాటే నేరుగా గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకుంటున్నాను. కోర్సు వ్యవధితో సంబంధం లేకుండా ఇక్కడ చదివిన విదేశీ విద్యార్థులకు వారి డిగ్రీ పట్టాతో పాటే గ్రీన్ కార్డు మంజూరు చేయాలని భావిస్తున్నాను’ అని వెల్లడించారు. తాను అధికారంలోకి వచ్చిన తొలిరోజే దీనిపై దృష్టి సారిస్తానని తెలిపారు. కరోనా వైరస్ కారణంగా గతంలో దీన్ని అమలు చేయలేకపోయానని సమర్థించుకున్నారు.

వీసా సమస్యల కారణంగా భారత్, చైనా వంటి దేశాల నుంచి వస్తున్న చాలా మంది అమెరికాలో ఉండలేకపోతున్నారని, వారంతా సొంత దేశాలకు వెళ్లి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రెండోసారి అధ్యక్ష పీఠం కోసం బరిలోకి దిగనున్న ట్రంప్.. గతంలో విదేశీ వలస విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కానీ, అందుకు భిన్నంగా ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.  

ట్రంప్‌ను నమ్మలేం..

డొనాల్డ్ ట్రంప్ నినాదమే అమెరికా ఫస్ట్.. ఉద్యోగాలైనా, సంపదైనా మొదట అమెరికా పౌరులకే దక్కాలన్నది ఆయన సిద్ధాంతం. అయితే, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఆయన ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. ౨౦౧౬ ఎన్నికల ప్రచారంలో కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వలస చట్టాలను అత్యంత కఠినతరం చేసి దేశం నుంచి వేలమందిని తరిమేశారు. ‘ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హెచ్‌౧బీ వీసాల రెన్యూవల్‌ను ఆలస్యం చేశారు. 

ఈ కార్డు ఉన్న పౌరుడి జీవిత భాగస్వామికి వర్క్ పర్మిట్ తొలగించారు. ఈ మనిషి ఒక అబద్ధాలకోరు. ఆయన దేనిగురించైనా, ఏమైనా మాట్లాడుతారు’ అని కాలిఫోర్నియాకు చెందిన భారతీయ పారిశ్రామికవేత్త అన్షు శర్మ విమర్శించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కుటుంబ ఆధారిత వీసాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. లాటరీ పద్ధతిలో వీసాలు జారీచేయటాన్ని రద్దుచేశారు. ‘అమెరికన్‌ను కొనుక్కోండి, అమెరికన్‌ను అద్దెకు తీసుకోండి’ అనే నినాదాన్ని ఇచ్చారు. అంటే అమెరికాలోని కంపెనీలన్నీ అమెరికా పౌరులకే ఉద్యోగాలివ్వాలని గట్టిగా పట్టుబట్టారు. దీంతో వేలమంది విదేశీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది