15 July, 2026 | 4:53 AM

కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

22-06-2024 12:05 AM
  1. బెయిల్‌పై స్టే విధించిన న్యాయస్థానం
  2. తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా
  3. సీఎంను ఉగ్రవాదిలా చూస్తున్నారు: సునీతా కేజ్రీవాల్ 

న్యూఢిల్లీ, జూన్ 21: మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో ట్రయల్ కోర్టు ఇచ్చి సాధారణ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కేజ్రీవాల్ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గురువారం సాయంత్రం కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ లభించింది. రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తు సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయవచ్చని న్యాయమూర్తి ఆదేశించారు. అవసరమైనప్పుడు కోర్టుకు హాజరై విచారణకు సహకరించాలని ఆదేశించారు.

అయితే ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కన పెట్టాలన్న ఈడీ వినతిని ట్రయల్ కోర్టు తిరస్కరించింది. దీంతో నేడు కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్‌ను వ్యతిరేకించేందుకు ట్రయల్ కోర్టు తమ వాదనలను వినిపించేందుకు తగిన సమయం ఇవ్వలేదని హైకోర్టుకు ఈడీ తరఫు న్యాయవాది వివరించారు. ట్రయల్ కోర్టు జడ్జి విచారణకు తొందరపడ్డారని, వేగంగా కేసును ముగించారని తెలిపారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, తమ పిటిషన్‌పై అత్యవ సర చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు. ఈడీ అభ్యర్థనను స్వీకరించిన హైకోర్టు.. జూన్ 25న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. అప్పటివరకు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను అమలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా కేజ్రీవాల్ విడుదలకు బ్రేక్ పడింది. ప్రస్తుతానికి ఆయన తీహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది.   

హద్దులు దాటిన నిరంకుశత్వం

కేజ్రీవాల్ బెయిల్ విషయంలో ఈడీ తీరుపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నీటి సమస్యపై భోగల్‌లో చేపట్టిన నిరాహార దీక్షలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయకముందే హైకోర్టులో ఈడీ ఎలా సవాలు చేస్తుందని నిలదీశారు. దేశంలో నిరంకుశత్వం హద్దులు దాటిందని మండిపడ్డారు. సీఎం స్థాయికి చేరిన వ్యక్తిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లా చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టులో న్యాయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆప్ నేత సంజయ్‌సింగ్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈడీ పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తోందని దిగువ కోర్టు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఈ విషయంలో ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.