calender_icon.png 18 September, 2025 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పని ప్రదేశాల్లో ఫిర్యాదుల కమిటీ తప్పనిసరి

18-09-2025 05:06:06 PM

లైంగిక వేధింపుల నివారణ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ (విజయక్రాంతి): ప్రభుత్వ, ప్రైవేటు, సంస్థలు కంపెనీలు, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నివారణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయడం తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టంపై జెడ్పీ సమావేశ మందిరంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పది మంది కంటే ఎక్కువ కార్మికులు లేదా ఉద్యోగులు ఉన్న అన్ని సంస్థలు, కంపెనీలు కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు పూర్తి చేయాలన్నారు. కమిటీ సభ్యుల వివరాలు, ఫోన్ నెంబర్లు, లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు ప్రదర్శించాలని ఆదేశించారు. పది మంది కంటే తక్కువ కార్మికులు లేదా ఉద్యోగులు ఉంటే వారిని జిల్లా లేదా మండల నోడల్ యూనిట్లో చేర్చాలన్నారు. ప్రైవేట్ సెక్టార్లకు సంబంధించి సంబంధిత ప్రభుత్వ శాఖల  అధికారులు అంతర్గత ఫిర్యాదుల కమిటీలను పర్యవేక్షించాలని ఆదేశించారు.

వీటి పర్యవేక్షణకు ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని అన్నారు. లైంగిక వేధింపులకు గురైన బాధితురాలు తప్పనిసరిగా తమ సంస్థ లేదా కార్యాలయంలోని ఐసీసీలో ఫిర్యాదు చేయాలని, వివరాలు గోప్యంగా ఉంటాయని అన్నారు. అదే తరుణంలో మహిళలకు మేలు చేసే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయరాదని సూచించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ అంతర్గత ఫిర్యాదుల కమిటీ జిల్లా స్థాయి కమిటీకి అనుబంధంగా ఉంటుందని తెలిపారు. ఐసీసీలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా కమిటీకి తీసుకురావచ్చని సూచించారు. వేధింపులకు గురైన మహిళ 90 రోజుల్లోగా తన ఫిర్యాదును సమర్పించాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే వెంకటేష్ మాట్లాడుతూ అంతర్గత ఫిర్యాదుల కమిటీ, జిల్లా స్థాయి ఫిర్యాదుల కమిటీ విధులు, బాధ్యతలను వివరించారు. మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టంలోని పూర్తి అంశాలపై కార్యక్రమానికి హాజరైన అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ స్వరూపారాణి, సిడిపిఓ సబిత, లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు, అడిషనల్ డీఎంహెచ్వో సుధా, ట్రస్మా చైర్మన్ శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.