02-11-2025 12:09:04 AM
మియాపూర్‌లో హెచ్‌ఎండీఏ భూముల ఆక్రమణపై కొరడా ఝుళిపించిన హైడ్రా
400 గజాల ప్లాట్ కొని, పక్కనే ఉన్న హెచ్‌ఎండీఏకు చెందిన 473 గజాలు కబ్జా
ప్రజావాణి ఫిర్యాదుల ఆధారంగా విచారణ
శేరిలింగంపల్లి, నవంబర్ 1 (విజయక్రాంతి): హేచ్‌ఎండీఏకు చెందిన భూముల ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపట్టింది. మియాపూర్ సర్వేనెంబర్ 100లో భూమిని ఆక్రమించి నిర్మించిన భారీ కట్టడాలపై హైడ్రా పంజా విసిరింది. మియాపూర్‌లో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనాన్ని శనివారం ఉదయం హైడ్రా సిబ్బంది కూల్చివేచారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పీజేఆర్ కాలనీ, మియాపూర్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న హెచ్‌ఎండీఏకు చెందిన భూమిని ఆక్రమించి ఆక్రమ నిర్మాణాలు చేపట్టారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన హైడ్రా.. మియాపూర్‌లోని 101 సర్వే నెంబర్‌లో సర్వే నంబర్ మార్చి భారీ అక్రమ నిర్మాణం చేపట్టినట్లు గుర్తించింది. అమీన్‌పూర్ సర్వే నంబర్ 337, 338 లలో హుడా అప్రూవ్‌డ్ లే అవుట్‌లో 400 గజాల ప్లాట్ కొని ఆ పక్కనే మియాపూర్ సర్వే నంబర్ 101 లోని దాదాపు 473 గజాలు కలుపుకొని భాను కన్‌స్ట్రక్షన్స్ యజమానులు ఎల్లారెడ్డి, ఇతరులు మొత్తం దాదాపు 873 గజాల్లో ఐదు అంతస్తుల భవనం నిర్మించారు. ఆ భవనంపై విచారణ చేసిన హైడ్రా సిబ్బంది.. అక్రమ నిర్మాణంగా తేలడంతో కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా భారీగా మోహరించారు పోలీసులు.