02-11-2025 12:06:38 AM
కులవివక్షతను ఎదుర్కోవడానికే దళిత ఆత్మగౌరవ పోరాటం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
ముషీరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): భారతదేశ అత్యున్నత న్యాయస్థాన మైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ బీఆర్ గవాయ్ మీద దాడి జరిగితే ఈ దేశ వ్యవస్థలన్ని ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా మౌనం వహించి అంటరానితనాన్ని ప్రదర్శించాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. జస్టీస్ బీఆర్ గవాయి మీద జరిగిన దాడిని నిరసిస్తూ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ నుండి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వేలాది మందితో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ‘బీఆర్ గవాయి దళితుడు కావడం వల్లనే ఈ దాడి జరిగిందన్నారు. గవాయి స్థానంలో ఉన్నత వర్గాలకు చెందిన న్యాయమూర్తులు ఉంటే ఈ దాడి జరిగి ఉండేదా అని ప్రశ్నించారు. అందువల్లనే ఈ దాడిని దళితుల మీద జరిగిన దాడిగా చూస్తున్నామన్నారు. గవాయి దళితుడు కావడం వల్లనే వ్యవస్థలన్నీ మౌనం వహించాయని, కానీ అదే స్థానంలో ఉన్నత వర్గాలకు చెందిన న్యాయమూర్తి ఉంటే ఇప్పటికే స్పందించి శిక్షలు వేసే వారని అన్నారు.
ఇంత కులవివక్షత పాటించడం అత్యంత అమానుషం అని అన్నారు. డిల్లీ పోలీసులు ఎందుకు ఇప్పటికీ కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు? సుప్రీం కోర్టు సుమోటోగా కేసు ఎందుకు స్వీకరించలేదన్నారు? జాతీయ మానవ హక్కుల కమిషన్ మౌనంగా ఉండిపోయిందని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో దళి తులకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దళితుల ఆత్మగౌరవ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ చట్టప్రకారం పని చేయాలని అన్నారు.
దాడులకు పాల్పడ్డ వారు దాడులను సమర్థించు కుంటుంటే, మళ్ళీ దాడులు చేస్తామని మాట్లాడుతున్న చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అన్నారు. విశ్వాసాల పేరుతో దాడులకు పాల్పడితే శిక్షలు వేయకపోవడం చట్టవిరుద్ధం అని అన్నారు. ‘విశ్వాసాల పేరుతో, ధర్మాల పేరు తో దళితుల మీద దాడికి పాల్పడితే కేసులు పెట్టరా? శిక్షలు వేయారా? అరెస్టులు చేయరా? ఇదేమి న్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివక్షతను దళిత సమా జం గట్టిగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతుందన్నారు.
దళితుల మీద దాడులకు పాల్పడితే సహించేది లేదన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం, దళితుల మీద దాడులు ఎదుర్కోవడం కోసం ఇక సిద్దమవుతామని అందు లో భాగంగా నవంబర్ 17 న ఛలో డిల్లీకి దళితులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీ ఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగ, కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు నరసప్ప మాదిగ, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు లోకేష్ మాదిగ, మహారాష్ట్ర అధ్యక్షుడు అజిత్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర నేత జాన్సన్ మాదిగ, ఉత్తరాఖండ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆశిష్ కుమార్, ముషీరాబాద్ నాయ కులు గజ్జల రాజశేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.