రూ.15 లక్షలతో ఈద్గా కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన
అశ్వాపురం, జూన్ 3 (విజయక్రాంతి): అశ్వాపురం మండల కేంద్రంలోని ఈద్గా ప్రాంగణంలో రూ.15 లక్షల వ్యయంతో చేపట్టనున్న కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం శంకుస్థాపన చేశారు. ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్తుల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనల నడుమ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ప్రార్థనా స్థలాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముస్లిం సోదరుల విజ్ఞప్తి మేరకు ఈద్గా అభివృద్ధి కోసం రూ.15 లక్షల నిధులు మంజూరు చేసి కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తయితే ఈద్గా ప్రాంగణానికి రక్షణతో పాటు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు అన్ని మతాల ప్రార్థనా స్థలాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, మత సామరస్యం, సామాజిక ఐక్యతను కాపాడుతూ ప్రతి వర్గానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి అశ్వాపురం మండలాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఈఈ మధుకర్, ఏఈ ఐవీఎన్ ప్రసాదరావు, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరరావు, మండల పరిషత్ సూపరింటెండెంట్ పిచ్చేశ్వరరావు, జీపీఓ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి యాకుబ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి బిక్ష్మయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, జామా మసీదు కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.






