15 July, 2026 | 2:46 AM

‘ఆ ఇద్దరే స్ఫూర్తి’

26-04-2024 12:12 AM

గుకేశ్‌కు చెన్నై ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

80 మంది విద్యార్థులతో గార్డ్ ఆఫ్ ఆనర్

‘భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ.. టెన్నిస్ సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్.. ఈ తరంలో ఎవరికి వారే సాటి. తన కెప్టెన్సీతో క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించి భారత క్రికెట్‌ను మరిం త ఎత్తుకు తీసుకెళ్లింది ఒకరైతే.. టెన్నిస్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు కొల్లగొట్టిన వీరుడు మరొకరు. ఆ దిగ్గజాలతో నన్ను పోల్చుకోవడం సరికాదు.. కానీ ఆ ఇద్దరే నాకు స్ఫూర్తి.. ఒత్తిడిలో ఎలా ఆడాలన్నది వాళ్ల నుంచే నేర్చుకున్నా.. అందుకే  వారి ఆటకు నేను ఆకర్షితుడినయ్యా’.. చెస్ నయా సంచలనం, భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ పలికిన మాటలు.

చెన్నై, ఏప్రిల్ 25: చదరంగ దిగ్గజం కార్ల్‌సన్ నుంచి చెస్ మాత్రమే కాకుండా.. ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నానని గుకేశ్ పేర్కొన్నాడు. ఫిడే క్యాండిడేట్స్ టైటిల్ నెగ్గిన గుకేశ్.. ఈ ఏడాది చివర్లో జరగనున్న ప్రపం చ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం సిద్ధమవుతున్నానని వెల్లడించాడు. ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ నెగ్గి చరిత్ర సృష్టించిన గుకేశ్ గురువారం స్వదేశానికి చేరుకున్నాడు. తెల్లవారు జామున 3 గంటలకు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన గుకేశ్‌కు ఘన స్వాగతం లభించింది. గుకేశ్ తల్లిదండ్రులతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో 80 మంది పాఠశాల విద్యార్థులు విమానాశ్రయానికి చేరుకొని గుకేశ్‌కు గార్డ్ ఆఫ్ ఆనర్‌తో వెల్‌కమ్ చెప్పడం ఆకట్టుకుంది.  ఈ సందర్భం గా గుకేశ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘ఒత్తిడిని ఎలా జయించాలన్నది దిగ్గజాలు ధోనీ, జొకోవిచ్‌లకు బాగా తెలు సు. అవసరమైన సందర్భాల్లో ఒత్తిడిని అధిగమించి బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చారు. అందుకే వాళ్లకు ఆకర్షితుడినయ్యా’ అని చెప్పుకొచ్చా డు. అంతకముందు తన గురువు విశ్వనాథన్ ఆనంద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన అకాడమీలో ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపాడు. తన కెరీర్‌ను ఇంత గొప్పగా మలిచిన ఆనంద్ సార్ లేకుంటే ఇవాళ ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని అభిప్రాయపడ్డాడు. ఇక విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ నెగ్గిన రెండో భారతీయుడిగా, అత్యంత పిన్న వయస్కుడిగా గుకేశ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో గుకేశ్.. డింగ్ లిరెన్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు.