యమ్నంపేట్‌లో గప్‌చుప్
పట్టా పొందారు.. జెండాలు పాతారు
చేయొద్దని లేఖ రాసినా ఆగని రిజిస్ట్రేషన్
పట్టాలు రద్దు చేయాలని కోరినా స్పందించని ఘట్‌కేసర్ తహసీల్దార్
ప్రభుత్వం నిర్మించిన ఫెన్సింగ్‌ను ఆనవాళ్లు లేకుండా చేసిన వైనం
తెరచాటున ఉన్న బడా లీడర్లపై సర్వత్రా చర్చ
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 28 (విజయక్రాంతి): ‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా ఉంది మేడ్చల్ జిల్లాలో రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల పనితీరు. ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరిగితే మాకేంటి మా జేబులు నిండితే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్న కారణంగా ఇప్పటికే విలువైన ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం యమ్నంపేట్ గ్రామ రెవెన్యూ పరిధిలో రూ.25 కోట్ల మున్సిపల్ స్థలంలో ఆక్రమణదారులు అర్ధరాత్రి జెండాలు పాతారు. దొడ్డిదారిన పొందిన పట్టాదారు పాసు పుస్తకాలను అడ్డం పెట్టుకొని ఓ వెంచర్‌లో కనిపించిన ఖాళీ జాగలో పాగా వేశారు. ఆ ఖాళీ స్థలం సంరక్షణలో భాగంగా రూ.20 లక్షలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను ఆనవాళ్లు లేకుండా చేశారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని రహేజా ఐటీ పార్కు వెనకాలే ఉన్న 8000 గజాల మున్సిపల్ భూమిని మాయం చేసేందుకు జరుగుతున్న కుట్రలపై కథనం.
ఖాళీ జాగపై కన్నేసిన కబ్జాదారులు..
వెంకటేశ్వర కాలనీ పేరుతో నిర్మించిన లేఔట్‌లోని ఖాళీ స్థలంపై మేడ్చల్ నియోజకవర్గంలో బడా లీడర్లుగా చెలామణి అవుతున్న నాయకుల కన్ను పడింది. ఎలాగైనా ఈ భూమిని దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఆ నాయకులు కుట్రలకు తెరలేపారు. ఇందులో భాగంగా 138/1 సర్వే నంబర్‌లో సుమారు 2.27 ఎకరాల భూమిపై హక్కులు కలిగి ఉన్న సయ్యద్ ముజఫర్ సుల్తానాను రంగంలోకి దించారు. వాస్తవానికి ఆమెకు ఈ ఖాళీ జాగ వెనకాల ఉన్న గుట్టలపై భూమి ఉంది.
ఆ భూమిపై 2018లో ధరణిలోనూ ఆమెకు పట్టాదారు పాసుపుస్తకం వచ్చింది. ఈ ధరణి పట్టాను అడ్డం పెట్టుకొని 138లోని 8000 గజాల భూమి సయ్యద్ ముజఫర్ సుల్తానాది అని పొజీషన్ తీసుకునే ప్రయత్నం చేశారు. కబ్జా అవుతున్న ఖాళీ స్థలాన్ని కాపాడాలని 2020 జూలై 1న మాజీ ఎంపీటీసీ నర్రి శ్రీశైలం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అప్పటి మున్సిపల్ కమిషనర్ రూ.20 లక్షలు వెచ్చించి ఫెన్సింగ్ నిర్మాణం చేశారు.
రద్దు చేయాలని తహసీల్దార్‌కు లేఖ..
ధరణి పట్టాదారు పాసు పుస్తకాన్ని అడ్డం పెట్టుకుని వెంకటేశ్వర కాలనీలోని 8000 గజాల ఖాళీ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారని గ్రహించిన పోచారం మున్సిపల్ కమిషనర్ దొడ్డిదారిన పొందిన పట్టాదారు పాసు పుస్తకాన్ని రద్దు చేయాలని కోరుతూ ఘట్‌కేసర్ తహసీల్దార్‌కు 2020 ఆగస్టు 7వ తేదీన లేఖ రాశారు. ఈ లేఖపై ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ భూమిపై ఎలాంటి క్రయవిక్రయాలు చేయొద్దని, గతంలో జారీచేసిన పట్టాదారు పాసుపుస్తకాన్ని రద్దు చేయాలని పోచారం మున్సిపల్ కమిషనర్ మళ్లీ తహసీల్దార్‌తో పాటు స్థానిక సబ్ రిజిస్ట్రార్‌కు, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు.
కానీ మున్సిపల్ కమినర్ రాసిన లేఖలపై తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కనీసం స్పందించ లేదు. ఈ వ్యవహారంపై మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసిన నర్రి శ్రీశైలం అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కారణం తెలియదు కానీ కొద్ది రోజులు విచారణ జరిగిన అనంతరం 2021లో శ్రీశైలం కేసు విత్‌డ్రా చేసుకోవడంతో కోర్టు అతని పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
అధికారుల గప్‌చుప్.. ఖాళీ జాగపై పాగా
కోట్ల విలువైన భూమిని దక్కించుకోవాలని తెరచాటున ఉండి కుట్రలు చేస్తున్న ఒకరిద్దరు బడా లీడర్లు మళ్లీ తమ అనునాయులను రంగంలోకి దించారు. ప్రస్తుతం అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో వెంకటేశ్వర కాలనీలోని 8000 గజాల ఖాళీ జాగపై పాగా వేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల 20న అర్ధరాత్రి ప్రభుత్వం రూ.20 లక్షలతో వేసిన ఫెన్సింగ్‌ను బుల్డోజర్లతో తొలగించిన ఆక్రమణదారులు, అదే రాత్రి 8000 గజాల ఖాళీ స్థలం చుట్టూ జెండాలు పాతారు. అంతేకాదు వెంకటేశ్వర కాలనీ వెంచర్‌లోని సుమారు 10 ప్లాట్లను కూడా ఆక్రమించి 138/1లోని 2.27 ఎకరాల స్థలం తమదేనంటూ ఏకంగా బోర్డులను ఏర్పాటు చేశారు.
ఈ విషయంపై ఆలస్యంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఈ నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే, ప్రస్తుతం ఈ భూమిపై జెండాలు పాతిన వ్యక్తుల వెనుక ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రధాన నాయకులు ఉండటంతోనే తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్‌తో పాటు పోచారం మున్సిపల్ కమిషనర్ ప్రస్తుతం గప్‌చుప్‌గా ఉన్నారని మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ విషయంపై పోచారం మున్సిపల్ కమిషనర్‌తో పాటు ఘట్‌కేసర్ తహసీల్దార్‌ను వివరణ కోరగా ఇరువురు అధికారులు ఫోన్‌కు స్పందించడం లేదు.
రిజిస్ట్రేషన్ చేయద్దని లేఖ రాసినా..
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 137, 138లోని 8000 గజాల ఖాళీ స్థలంపై ఎలాంటి క్రయవిక్రయాలు చేపట్టొద్దని పోచారం మున్సిపల్ కమిషనర్ 2020 జూలై 24న సబ్ రిజిస్ట్రార్‌కు, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. కానీ స్థానిక రిజిస్ట్రార్ ఆ లేఖను ప్రామాణికంగా తీసుకోకుండానే కమిషనర్ లేఖ రాసిన రోజే సయ్యద్ ముజఫర్ సుల్తానా పేర ఉన్న 2.27 ఎకరాల స్థలాన్ని పోలగోని రాజేందర్ గౌడ్, రేజింటల విక్రమ్ కుమార్ అనే వ్యక్తులపై రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం ఈ సేల్‌డీడ్‌ను మ్యూటేషన్ చేయడంతో పాటు ఘట్‌కేసర్ తహసీల్దార్ ధరణిలో పట్టాదారు పాసు పుస్తకాన్ని కూడా జారీ చేశారు.
1987లోనే లేఔట్..
ఘట్‌కేసర్ మండలం యమ్నంపేట్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 137, 138లోని 29.30 (సుమారు 30 ఎకరాల్లో) ఎకరాలలో వెంకటేశ్వర కాలనీ పేరుతో 1987లో లేఔట్ చేశారు. ఈ లేఔట్‌లోని ప్లాట్లను గతంలోనే విక్రయించారు. ఈ వెంచర్‌లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజల కమ్యూనిటీ అవసరాలతో పాటు కాలనీ పార్కు నిర్మాణ నిమిత్తం 8000 వేల గజాల స్థలాన్ని ఖాళీగా వదిలేశారు. ఆ కాలనీలో కొందరు ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టారు. గత 37 ఏళ్లుగా 8000 గజాల స్థలం ఖాళీగానే ఉంది. ఈ ఖాళీ స్థలాన్ని సంరక్షించాలనే లక్ష్యంతో గతంలో ప్రభుత్వం రూ.20 లక్షలు వెచ్చించి ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసింది. అలాగే మున్సిపల్ అధికారులు గత కొన్నేళ్లుగా మున్సిపాలిటీ పరిధిలోని చెత్తను కూడా ఈ ఖాళీ స్థలంలోనే వేస్తున్నారు.






