30 July, 2026 | 1:07 PM

‘గృహజ్యోతి’ గుబులు!

29-05-2024 01:12 AM

సిద్దిపేట రూరల్, మే 28(విజయక్రాంతి): ‘గృహజ్యోతి’ పథకంపై నిరుపేదల్లో గుబులు పట్టుకుంది. విద్యుత్తు జీరో బిల్లు రాకపోవడంపై నిరాశలో మునిగిపోయారు. కొందరికి వచ్చి మరికొందరికి ఎందుకు రాలేదనే సందేహాల గందరగోళంలో పడ్డారు. అయితే, తొలివిడత ప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలో తప్పిదాల వల్ల కొందరికి జీరో బిల్లు అమలు కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించిన అనంతరం.. అధికారులు బృందాలు అర్జీల ఆధారంగా సర్వే నిర్వహించి, అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి సర్వే నిర్వహించలేదని పలువురు చెబుతున్నారు. ఆ దరఖాస్తులను ఆఫీసుల్లోనే ఆన్‌లైన్ చేయడం వల్ల తప్పిదాలు జరిగి, పథకాల అమలులో పలువురికి అన్యాయం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో చాలామంది ప్రజాపాలన దరఖాస్తుదారులు జీరో కరెంట్ బిల్లు రాక నిర్వేదంలో మునిగారు. ఏరోజుకారోజు విద్యుత్ అధికారులు వచ్చి.. జీరో బిల్లు కోసం వివరాలు రాసుకుంటారేమోనని ఎదురు చూస్తున్నారు. కొందరు నిత్యం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా నమ్మశక్యమైన సమాధానం రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఎన్నికల కోడ్ పథకాల అమలుకు అడ్డంకిగా మారినప్పటికీ ఆ తర్వాతనైనా పథకాల అమలు కొనసాగుతుందా? లేదా? అనే సందేహాలతో సామాన్య ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.

కోడ్ ముగిశాక అందరికీ పథకాలు అందేలా చూడాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు. ఆన్‌లైన్ ప్రక్రియలో జరిగిన తప్పిదాలను గుర్తించి, వీలైనంత త్వరగా అర్హులను గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, జీరో బిల్లు అంశంపై సిద్దిపేట విద్యుత్ శాఖ జిల్లా అధికారి పి.మోహన్‌రెడ్డిని వివరణ కోరగా ఎన్నికల కోడ్ ముగిశాక ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

మండలం ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా 

జీరో బిల్లు రావడం లేదు. కారణమేంటో తెలుసుకోవడానికి మండలం ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ ఏం చెప్పడం లేదు. కొందరేమో సర్కారు మళ్లీ చెప్పేదాకా ఎవరికీ పథకాలు రావంటున్నారు. కొందరేమో.. ఎన్నికల కోడ్ అయ్యాక వస్తాయంటున్నారు. ఎవరి మాట నమ్మాలో అర్థం కావడం లేదు. అర్హులందరికీ పథకాలు అందించాలని మా కోరిక. 

-పద్మారెడ్డి, సిద్దిపేట