30 July, 2026 | 11:55 AM

ఏసీబీ దాడులు.. ఆర్టీఏ లీలలు

29-05-2024 01:18 AM

ఆకస్మిక తనిఖీలతో సిబ్బంది చేతివాటం బట్టబయలు

విజయక్రాంతి నెట్‌వర్క్ : ఏసీబీ అధికారులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఆర్టీఏ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.దాదాపు అన్ని కార్యాలయాల్లోనూ సిబ్బంది కంటే దళారుల హవా నడుస్తు న్నదని ఏసీబీ అధికారులు గుర్తించారు. వాహనదారుల డాక్యుమెంట్లను సైతం దళారులే చేతబట్టుకుని దర్జాగా సిబ్బందితో పనిచేయించుకుంటున్నట్లు గుర్తించి వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. కొన్నిచోట్ల ఎంవీఐ, డీటీవో స్థాయి అధికారులు కూడా యూనిఫాం లేకుండా విధులు హాజరుకావడం, అధికారుల స్థానంలో డ్రైవర్లు వసూళ్ల పర్వానికి తెరలేపడం.. చెక్‌పోస్టుల్లో వాహన చక్రాలను బట్టి రేట్ ఫిక్స్ చేసి డబ్బు గుంజడం.. 

ఇలా ఎన్నో ఘటనలు తనిఖీల్లో బయటపడ్డాయి.           

ఆకస్మిక తనిఖీలతో సిబ్బంది చేతివాటం బట్టబయలు

సిబ్బందితో దర్జాగా పనిచేయించుకుంటున్న దళారుల గుర్తింపు

మానుకోటలో డీటీవో డ్రైవర్ వసూళ్ల పర్వం

అశ్వారావుపేట చెక్‌పోస్టులో వాహనానికో రేటు

రాష్ట్రవ్యాప్తంగా లెక్కచూపని సొమ్ము రూ.2,70,720 సీజ్

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ కార్యాలయాలు, చెక్‌పోస్టుల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి. 15 ప్రత్యేక బృందాలు దాడు ల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ, మలక్‌పేట, టోలీచౌక్, మణికొండ సహా నల్గొండ, మహబూబ్ నగర్, సిద్దిపేట, కరీంనగర్, మహబూబాబాద్ ఆర్టీఏ కార్యాలయాలు, సాలూర (నిజామాబాద్), భోరాజ్ (ఆదిలాబాద్) అశ్వారావు పేట (భద్రాద్రి కొత్తగూడెం) చెక్ పోస్ట్‌లను తనిఖీ చేశారు.

అధికారులు లెక్కచూపని రూ.2,70,720 నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఉన్న వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులను సైతం స్వీకరించారు. మహబూబ్‌నగర్ ఆర్టీఏ ఆఫీస్‌లో ఇతరుల డాక్యుమెంట్లతో ఉన్న ఐదుగురు ఏజెంట్లు పట్టుబడ్డారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట ఆర్టీఏ కార్యాలయంలో 15 మంది అనధికార వ్యక్తులు లావాదేవీలు చేస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులను చూసి నింది తులు దాచిన రూ.22 వేలను అధికారులు స్వాధీనం చేసుకవన్నారు. ఇలా 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారించారు.

కార్యాలయాల్లో సేవల కోసం వచ్చే తమను సిబ్బంది, ఏజెంట్లు వేధిస్తున్నారంటూ వందలాది మంది వాహనదారులు ఏసీబీ అధికారులకు ఏకరువు పెట్టారు. రవాణాశాఖ కార్యాలయాలు, చెన్‌పోస్టుల్లో ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయని ముందే సమాచారం అందుకున్న ఏజెంట్లు, అధికారులు, సిబ్బంది ముందుగానే అప్రమత్త మయ్యారు. ప్రతిరోజూ ఏజెంట్లతో కిటకిటలాడే కార్యాలయాల్లో రద్దీ కాస్త తగ్గింది. 

మహబూబాబాద్‌లో డబ్బులు వసూలు చేస్తున్న డ్రైవర్..

మహబూబాబాద్ ఆర్టీఏ కార్యాలయం లో డీటీవో డ్రైవర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఏజెంట్లు నేరుగా ఆర్టీఏ కార్యాలయంలోకి వచ్చి వేరొకరి డాక్యుమెంట్లతో ఏసీబీ కంటబడ్డారు. దీంతో ఏసీబీ అధికాకారులు డీటీ వోతోపాటు ఆయన డ్రైవర్‌ను విచారించా రు. ఆర్టీఏ సిబ్బందిని, ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ. 61,900 సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.

అన్నిచోట్ల అదే తంతు..

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీవో కార్యాలయాల్లోనూ అనధికార వ్యక్తులు హల్‌చల్ చేస్తుండటాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. తనిఖీల్లో భాగంగా వీరందరనీ విచారించారు. అలాగే ఆర్టీవోలు, డీటీవోలు కొన్నిచోట్ల యూనిఫాం ధరించకపోవడం గమనార్హం. పలు చోట్ల సిబ్బంది ఎలాంటి సెలవు పెట్టకుండానే విధులకు గైర్హాజరైనట్లుగా ఏసీబీ తనిఖీల్లో తేలింది. బండ్లగూడలో  రూ.48,370, మలక్‌పేటలో రూ.22,000, టోలిచౌకీలో రూ.43,360, మణికొండలో రూ.23,710, నల్లగొండలో  రూ.12,200, సాలూర్ చెక్ పోస్టులో రూ. 13,500, బోరాజ్ చెక్‌పోస్టులో రూ. 11,630, మహబూబాబాద్‌లో రూ. 61,900, అశ్వారావుపేట చెక్‌పోస్ట్‌లో రూ. 34,050 సొమ్ము పట్టుబడింది.

లారీడ్రైవర్ల వేషధారణలో వచ్చి..

అక్రమాలకు ఆలవాలమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు చెక్ పోస్టు పై ఏసీబీ అధికారులు సినీ ఫక్కీలో దాడి చేశారు. డ్రైవర్ల వేషధారణలో చెక్‌పోస్ట్ వద్దకు వెళ్లి సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సిబ్బంది ఒక్కో వాహనానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి డబ్బు వసూలు చేస్తున్నట్లుగా ఏసీబీ గుర్తించింది.  10 టైర్ల లారీకి రూ.300, 12 టైర్ల లారీకి రూ.400 చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఎక్కువలో ఎక్కువ రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నట్లుగా గమనించారు. మొత్తం ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఎంవీఐ యూనిఫాం ధరించకుండా విధుల్లో ఉన్నాడని ఏసీబీ అధికారులు తెలిపారు.