5 April, 2026 | 6:04 PM

మరిమడ్లలో వడగండ్ల వాన విధ్వంసం – రైతుల పంటలు నేలమట్టం

05-04-2026 10:53 AM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో అకాల వర్షం, భీకర వడగండ్ల వాన రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. కష్టపడి పండించిన పంటలు కళ్లముందే నేలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నిమిషాల్లోనే నాశనం కావడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

సగ్గుపట్ల వసంత, అక్కెనపెల్లి రమేష్, కుమ్మరి అధిబాబు, రాజా మల్లేశం, కుమ్మరి దిలీప్, కుమ్మరి రాజు, బైరీ మల్లేశం, పెద్ద మొండయ్య, అక్కెనపెల్లి మైసయ్య, అక్కెనపెల్లి చంద్రయ్య, బోల్లం శ్రీనివాస్, గోవర్ధన్ వంటి రైతులతో పాటు దాదాపు 90 శాతం మంది రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.అప్పులు తెచ్చుకుని, ఎండనక వాననక శ్రమించి పండించిన పంట ఒక్కసారిగా రాళ్ల వానకు బలైపోవడంతో రైతులు కన్నీరుమున్నేరవుతున్నారు.

"ఈ పంటే మా జీవనాధారం… అప్పులు తీర్చుకోవాలి, పిల్లల పెళ్లిళ్లు చేయాలి. కానీ ఇప్పుడు మేము రోడ్డున పడిపోయాం" అంటూ రైతులు వేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం చూసి కొందరు రైతులు పొలాల్లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. గింజ గింజకు ప్రాణం పోసి పెంచిన పంట ఇలా నాశనం కావడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. మరిమడ్ల గ్రామ రైతులు ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణ సహాయం అందించాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమ పరిస్థితి దయనీయంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.