31 May, 2026 | 1:56 AM

చిన్న కాంట్రాక్టర్లను చిదిమేశారు!

31-05-2026 01:14 AM

డిక్లరేషన్లు, గ్యారెంటీల పేరిట అన్నివర్గాలను నట్టేట ముంచిన కాంగ్రెస్

చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చిన నిధులు, టెండర్లపై శ్వేతపత్రం ఇవ్వాలి

జీవో 17 రద్దయ్యే వరకు.. బడుగు బలహీన వర్గాలకు కాంట్రాక్టులు దక్కే వరకు పోరాటం ఆగదు

2028లో మన ప్రభుత్వమే వస్తుంది  

50 వేల మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాం

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టి, బొందపెట్టాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కే తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో మక్కలు, వడ్లు కొనుగోలుకాక రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇవాళ ఏ ఒక్క ఊరికైనా కాంగ్రెస్ వాళ్లు వెళ్లే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.

హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాధర్నాలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్ని కలకు ముందు 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, 420 హామీలతో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. అధికారం లోకి వచ్చాక అన్ని వర్గాలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు.

ఎన్నికల ముందు చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల పేరు తో ప్రభుత్వ కాంట్రాక్టులో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం, బీసీలకు 42 శాతం (మొత్తం 72 శాతం) రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికారని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చాక 72 శాతం కాదు గదా, 72 పైసలు కూడా ఈ వర్గాలకు ఇవ్వకుండా అడ్డగోలు జీవోలను తెచ్చారని మండిపడ్డారు.

చివరికి గురుకుల పాఠశాలల్లో స్థానిక చిన్న కాంట్రాక్టర్లు సరఫరా చేసే కూరగాయలు, చికెన్, పాలు, బ్రెడ్ వంటి వాటిని కూడా వారికి దక్కకుండా చేస్తూ ’జీవో నెం.17’ తీసుకువచ్చి, ఆ టెండర్లను పెద్ద కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చిన్న కాంట్రాక్టర్లను రోడ్లపైకి తెచ్చిన ఈ జీవో 17 రద్దయ్యేవరకు, బడుగు, బలహీన వర్గాలకు కాంట్రాక్టులు దక్కేవరకు పోరాటం ఆపేదిలేదని కేటీఆర్ స్పష్టంచేశారు.

శ్వేతపత్రం విడుదల చేయాలి..

ఇవాళ రాష్ట్రంలో కాంట్రాక్టులు కేవలం ఇద్దరికే దక్కుతున్నాయని, రేవంత్ రెడ్డి బామ్మర్దికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకుకే అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సొంత నియోజకవర్గం కొడంగల్-- నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రూ.4 వేల కోట్ల కాంట్రాక్టును తన అనుయాయులకే ఇచ్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో కేవలం వాళ్ల బంధువులకే కాకుండా, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు రూ.1300 కోట్ల కాంట్రాక్టులు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్‌రె డ్డి ఇప్పటివరకు రూ.4 లక్షల కోట్ల అప్పు చేశారని, అందులో రూ.4 అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చారా అని ప్రశ్నించారు. చిన్న కాంట్రాక్టర్లకు విడుదలచేసిన నిధులు, చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము రేవంత్ సర్కారుకు ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి పేమెంట్ కోటాలో గద్దెనెక్కారని, ఆయన ఒక రెగ్యులర్ సీఎం కాదని, కేవలం ’రెన్యూవల్ సీఎం’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్‌కు నెలనెలా కప్పం పంపి తన కుర్చీని కాపాడుకుంటున్నారని, ఢిల్లీకి బ్యాగులు మోసినన్ని రోజులు మాత్రమే ఆయన ఉద్యోగం ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ బడుగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా ఢిల్లీ హైకమాండ్ మౌనంగా ఉండటానికి ఇదే కారణమన్నారు. ఈ ద్రోహానికి రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని కూడా నిలదీయాలని పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో దాదాపు పది వేల మంది యువతకు కాంట్రాక్టర్లుగా అవకాశాలు కల్పించిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 17ను తీసుకువచ్చి కాంట్రాక్టర్లను రోడ్డున పడేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ప్రభుత్వం ఏర్పడ్డాక మరో 50 వేల మంది యువ కాంట్రాక్టర్లను తయారు చేస్తామని చెప్పారు.

కాంట్రాక్టర్లకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌చేశారు.  కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వల్లే నేడు రోడ్డు పడ్డారన్నారు. బలహీనవర్గాల హక్కుల కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

సంపద సృష్టి-అద్భుత ప్రగతి

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ’సంపద సృష్టించాలి -పేదలకు పంచాలి’ అనే దృక్పథంతో పనిచేశారన్నారు. నాడు చిన్న చిన్న కాంట్రాక్టర్లను ఆదుకుని గౌరవంగా నిలబెట్టారని గుర్తు చేశారు. కేసీఆర్ అప్పులు చేసి 1000కి పైగా గురుకులాలు కట్టించి, 6.50 లక్షల మంది బడుగు విద్యార్థులకు ఒక్కొక్కరిపై రూ.1.20 లక్షల నుంచి రూ.1.25 లక్షల వరకు ఖర్చుపెట్టి కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య, బూట్లు, బట్టలు, నాణ్యమైన భోజనం అందించారని పేర్కొన్నారు.

అప్పులతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, జిల్లాకో మెడికల్ కాలే జీ, నర్సింగ్ కాలేజీ తెచ్చారని, 24 గంటల కరెంట్, కేసీఆర్ కిట్, 15 లక్షల మంది ఆడబిడ్డలకు మేనమామ కట్నంగా కల్యాణ లక్ష్మి కింద ఆర్థిక సాయం అందించారని తెలిపారు. రైతులకు రూ.72 వేల కోట్ల రైతుబంధు సాయాన్ని నేరుగా ఖాతాల్లో వేశారని గుర్తు చేశారు. ముఖం బాగాలేక అద్దం పగులగొట్టుకున్న చందంగా.. తాము చేతగాక కేసీఆర్ అప్పులు చేశాడని రేవంత్‌రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు.

హద్దు మీరి మాట్లాడితే ఊరుకునేది లేదని, తెలంగాణ తెచ్చిన మగోడు, మొనగాడు కేసీఆర్ అని కేటీఆర్ గర్వంగా ప్రకటించారు. మైనర్ బాలికకు అన్యాయం జరిగితే ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వదిలిపెట్టకుండా ఎట్లా పోరాడారో, బడుగుల సమస్యలపై కూడా అలాగే పోరాడతామన్నారు.

బడుగు వర్గాల సమస్యలపై అధికారులకు, మం త్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని, ఒకవేళ వాళ్ళు వినకపోతే భవిష్యత్తులో జంతర్ మంతర్ లేదా ఢిల్లీ వేదికగానైనా పోరాడుతామన్నారు. 2028లో తప్పకుండా మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తుందని, నాడు 10 వేల మంది కాదు, దాదాపు 50 వేల మంది బడుగు, బలహీన వర్గాల యువకులను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దే బాధ్యత ను కేసీఆర్ తీసుకుంటారని కేటీఆర్ అభయమిచ్చారు.