ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ.. ప్రయాణికుడి సెల్‌ఫోన్ అప్పగింత
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు–ఖమ్మం రూట్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ, మానవత్వాన్ని చాటుకున్నారు. ఇల్లందు నుంచి ఖమ్మం వెళ్లే బస్సులో ఓ ప్రయాణికుడు తొందరలో తన సెల్‌ఫోన్‌ను సీటుపై మర్చిపోయి దిగిపోయాడు. ఖమ్మం నుంచి తిరిగి వచ్చిన సర్వీసు బస్టాండ్‌కు చేరుకున్న అనంతరం కండక్టర్ వెంకటేశ్వర్లు, డ్రైవర్ ఖలీల్ బస్సులోని సీట్లను తనిఖీ చేయగా సెల్‌ఫోన్ కనిపించింది. వెంటనే ఖమ్మం బస్టాండ్ ఎస్‌ఎం ఆధ్వర్యంలో ఫోన్ యజమానిని గుర్తించి, అతనికి సెల్‌ఫోన్‌ను సురక్షితంగా అప్పగించారు.
కష్టపడి సంపాదించిన సెల్‌ఫోన్ తిరిగి దొరకడంతో ప్రయాణికుడు ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కండక్టర్ వెంకటేశ్వర్లు, డ్రైవర్ ఖలీల్ నిజాయితీపై ప్రయాణికులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ట్రిప్ అనంతరం బస్సును తనిఖీ చేయడం వల్లే ఫోన్ యజమానికి చేరిందని పేర్కొన్నారు. నిజాయితీ, బాధ్యతతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బంది పట్ల ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతోందని పలువురు అభినందించారు.






