29 June, 2026 | 3:05 PM

Breaking News

పెద్దఎత్తున హ్యాండ్స్ ఆఫ్ ఇరాన్

24-06-2025 01:54 AM
  1. అమెరికాలో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు
  2. ఇజ్రాయెల్‌కు మద్దతు ఆపాలని అట్టుడికిన అమెరికా
  3. బ్రిటన్ తదితర దేశాల్లోనూ పెల్లుబికిన నిరసనలు

వాషింగ్టన్/లండన్, జూన్ 23: ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసిన తర్వాత ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఈ దాడుల అనంతరం అమెరికాలోని పలు ప్రధాన నగరాల్లో యుద్ధ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. ఇరాన్‌తో యుద్ధానికి దిగొద్దని, ఇజ్రాయెల్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. ‘హ్యాండ్స్ ఆఫ్ ఇరాన్’ ‘నో యూఎస్ వార్ ఆన్ ఇరాన్’ అనే బ్యానర్లతో వీధుల్లోకి వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.

ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు తెలపడాన్ని నిరసనకారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అమెరికాలోని ప్రధాన నగరాలతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ నిరసనలు మిన్నంటాయి. వైట్ హౌస్ వద్ద కూడా నిరసనకారులు ఆందోళన చేపట్టారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్కేర్‌లో ప్రదర్శనకారులు గూమిగూడారు. 

ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట అమెరికా మిడ్ నైట్ హ్యామర్ పేరిట ఇరాన్‌పై దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలు ఒక్క అమెరికాకే కాకుండా ఇతర దేశాలకూ వ్యాపించాయి. బ్రిటన్ సహా జర్మనీ, పాకిస్థాన్, ఆస్ట్రేలియా మొదలయిన దేశాల్లో ఈ నిరసనలు చెలరేగాయి.