26 April, 2026 | 6:39 AM

వ్యవసాయమే ఆధారంగా బ్రతుకుతున్న గిరిజన ప్రజలను ఆదుకోవాలి

20-12-2024 07:58 PM

అసెంబ్లీలో మాట్లాడిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్‌ మోహన్‌ రావు

స్పీకర్‌పై దాడిని ఖండించిన ఎమ్మెల్యే మధన్‌ మోహన్‌ రావు

కామారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వ్యవసాయమే ఆధారితంగా బతుకుతున్న రైతులు ఎంతోమంది ఉన్నారని ఉద్యోగ, ఉపాధి లేక వ్యవసాయాన్ని జీవనాధారంగా రైతులు బతుకుతున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్‌మోహన్‌రావు గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులకు, అటవీ భూముల సరిహద్దులకు అనుకుని ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి గిరిజన ప్రజలకు, అటవీ అధికారులకు మధ్య తరుచుగా వివాదాలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం  తీసుకోవాల్సిన శాశ్వత పరిష్కారం కోసం ఈ సమస్యను సభ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈ సమస్యల విషయంలో ప్రత్యేకంగా చాలా మండలాల ప్రజలు విభిన్న రకాల సమస్యను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు 30 ఏళ్ల నుంచి అటవీ భూముల సరిహద్దులకు అనుకొని ఉన్న వ్యవసాయ భూముల్లో, రైతులు కాస్తులో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు.

వారు బీసీ సామాజిక వర్గానికి చెందినందున వారికి గతంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు జారీ చేయబడలేదు. ఇన్నేళ్లుగా ఏమి అన్నాని అటవీశాఖ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వారిని వ్యవసాయం చేయకుండా ఆ భూముల నుంచి ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని, రాజంపేట మండలం ఎల్లాపూర్ తండా, హద్దు గుండు తండాలకు చెందిన చాలా మంది రైతులకు ఆర్‌ఓఎఫ్ పట్టాలు పొందినప్పటికి కొంతమంది గిరిజన రైతులకు కొన్ని సాంకేతిక కారణాలతో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు రాకపోవడంతో రైతులను అటవీశాఖ అధికారులు వ్యవసాయం చేయనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాగిరెడ్డిపేట మండలానికి చెందిన లింగంపేట, తాండురు గ్రామాల్లో  సుమారుగా ప్రభుత్వం ఆసైన్డ్ భూమి 600 ఎకరాల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయంలో జరిగిన ల్యాండ్ రికార్డ్స్, అప్డేషన్ ప్రోగ్రామ్ కంటే ముందుకు ఈ రైతులకు పాత పాస్ బుక్స్ ఉన్నాయి.

వాటి మీద రైతులకు రుణాలు, యాజమాన్య హక్కులు సైతం కలిగి ఉన్నారు. ఈ ల్యాండ్ రికార్స్, అప్డేషన్ పోగ్రాం నిర్వహించి కొత్త పాస్ బుక్ లు ఎప్పుడైతే జారీ చేశారో, అప్పటి నుంచి ఈ రైతులకు కొత్త పాస్ బుక్ లు జారీ చేయలేదన్నారు. అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఈ రైతులకు నూతన పాస్ బుక్ లు జారీ చేయలేదని రెవెన్యూ శాఖ  అధికారులు వెల్లడించారు. దీంతో ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు రైతు భీమా, రుణమాఫీ వంటి ఈ వ్యవసాయ సంబంధిత పథకాలకు అర్హులు కావడం లేదని వాపోయ్యారు. గాంధారి మండలం గౌరరం గ్రామంలో 627 సర్వే నెంబర్‌లో సుమారుగా 370 ఎకరాల విస్తీర్ణం ప్రభుత్వ  ఆసైన్ భూమిలో 210 మంది రైతులకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టాపాస్ బుక్‌లు జారీ చేశాయి. ఈ రైతులు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు జారీ చేసిన పాస్ బుక్‌ల ద్వారా యాజమాన్య హక్కులకు అనుభవించడంతో పాటు పంట రుణాలను తీసుకోవడంతో పాటు వివిధ వ్యవసాయ సంబంధిత సంక్షేమ పథకాలను అనుభవించారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ల్యాండ్ రికార్స్, అప్డేషన్  పోగ్రాం కార్యక్రమం తర్వాత తమ భూమి అని రెవెన్యూ డిపార్మెంట్ వారు .. కాదు తమ భూమి అని ఫారెస్ట్ డిపార్మెంట్  క్లెయిమ్ చేసుకుంటున్నారన్నారు. ఇలా  రెండు ప్రభుత్వ శాఖల  మధ్య నలుగుతూ రైతులు నష్టపోతున్నారన్నారు. లింగంపేట మండలానికి చెందిన నల్లమడుగు తండాకు చెందిన గిరిజన రైతు లక్ష్మణ్ నాయక్ తాను 30 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పోడుభూమికి ఆర్వోఫ్‌ఆర్ పట్టాపాస్‌బుక్‌రాకపోవడంతో ఆత్మహత్య ప్రయత్నం చేశాడన్నారు. సంబంధిత పట్టాపాస్‌బుక్ రాకపోతే అటవీ అధికారుల  ఇబ్బందులతో వ్యవసాయం చేసుకోవడం కష్టమన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపల్లి మండలం ఎక్కపల్లి తండా, ఇతర  మండలాల్లో సైతం ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల  ద్వారా రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో మడులు కట్టనీయకుండా పైప్‌లైన్ వేయకుండా, బోరు వేయకుండా ట్రాక్టర్‌తో దున్నకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారన్నారు. దీంతో ఈ వ్యవసాయ భూములన్ని నిరుపయోగంగా మారి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయన్నారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలో ఉన్న కాయితీ లంబాడాలు బీసీ సామాజిక వర్గం పరిధిలో వస్తారని దీంతో వారు సాగు చేసుకుంటున్న పోడు భూములకు రాష్ట్ర ప్రభుత్వం (ఆర్‌ఓఎఫ్‌ఆర్) పట్టాలను జారీ చేయలేదన్నారు. దీంతో కాయితి లంబాడాలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు యాజమాన్య హక్కులు లేక అన్యాయమైపోతున్నారన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్, పట్టాలు ఇచ్చిన భూముల్లో నీటి సదుపాయాం కోసం బోర్లు వేసుకునే విధంగా పైప్‌లైన్లు వేసుకునే విధంగా ఆధునాతన వ్యవసాయ పనిముట్లతో వ్యవసాయం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని అటవీశాఖ  అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే మధన్‌మోహన్‌రావు తెలిపారు.తండాలలో  గిరిజనుల ఇండ్ల నిర్మాణాలకు అటవీశాఖ అధికారులు అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అభ్యంతరం తెలుపకుండా అటవీశాఖ  అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజప్తి చేశారు.