మెడ రంగు మారిందా?
ముఖం అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాల క్రీములు, ప్యాక్‌లు వాడుతాం. కానీ మెడ భాగానికి వచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తుంటాం. మెడ చుట్టూ నల్లటి వయలం. సన్నటి ముడతలు, చిన్న చిన్న పొక్కులతో క్రమంగా చర్మం కాంతి విహీనంగా కనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మెడ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..
* ముఖంపై ఉండే చర్మం కన్నా మెడ చర్మం చాలా పల్చగా, సున్నితంగా ఉంటుంది. అందుకని ఎక్కువ గాఢత కలిగిన సబ్బులను వాడకూడదు. వీలైనంత వరకు రసాయనాలు లేని సబ్బు, బాడీ వాష్‌లను వాడాలి. అంతేకాదు.. ముఖాన్ని శుభ్రం చేసుకునే ప్రతిసారీ మెడను కూడా శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
* చెమట వల్ల మెడపై చాలా త్వరగా మురికి చేరుతుంది. అంతేకాదు నిత్యం మనం ధరించే చెయిన్ల వల్ల కూడా మెడపైన మురికి పేరుకునే అవకాశం ఉంది. సబ్బుతో పైపై మురికి పోయినా, చర్మ రంధ్రాల్లో పేరుకున్న మలినాలు పోవాలంటే స్క్రబ్బర్ తప్పనిసరి. ఇలా జరగకుండా ఉండాలంటే మనం వేసుకునే చెయిన్లను శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి నాలుగుసార్లు స్క్రబ్బర్ వాడాలి.
* బాదం పలుకులని బరకగా పొడి చేసి, కొద్దిగా పాలు కలిపి పేస్ట్‌లా చేసి మెడకు పట్టించాలి. భుజాల నుంచి ముఖం వైపుగా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసి, చల్లటి నీటితో కడిగేయాలి. ఐదు నిమిషాలకు మించి స్క్రబ్ చేయకూడదు. ఎందుకంటే అతిగా స్క్రబ్ చేయడం వల్ల పల్చని మెడ చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది.
* పాలమీగడలో పావు చెంచా నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి మెడకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే మెడ చుట్టూ పేరుకున్న నలుపు క్రమంగా తగ్గుతుంది.
* ముఖంపై చర్మానికి టోనర్ వాడేటప్పుడు మెడకు కూడా టోనర్ అప్లు చేయడం అలవాటు చేసుకోవాలి. కానీ మెడకి టోనర్ రాసుకునేటప్పుడు నేరుగా చేతి వేళ్లతో కాకుండా దూదిని వాడాలి.






