5 July, 2026 | 6:30 PM

చావు ఎదురొచ్చినా ఒంటరిగా నిలబడతాడు

24-12-2024 12:00 AM

‘కిచ్చా’ సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మ్యాక్స్’. వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, శరత్ లోహితస్య కీలక పాత్రల్లో నటించారు. హొవీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 27న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా తెలుగులో ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ క్రమంలోనే సోమవారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘మా పొలిటికల్ కెరీర్‌కి ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్’ అని వాయిస్ ఓవర్‌లో డైలాగ్ వస్తుండగా ట్రైలర్ ప్రారంభమవుతుంది. శరత్ లోహితస్య, సునీల్ క్యారెక్టర్ పరిచయం చేశారు. సునీల్ విలన్ పాత్రలో నటించారని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ‘చావు ఎదురొచ్చినా సరే మా అబ్బాయి ఒంటరిగా నిలబడి పోరాడతాడు’ అని హీరో మదర్ చెప్పిన డైలాగ్‌తో సుదీప్‌ను చూపించారు.

సుదీప్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ‘మ్యాక్స్‌తో మాట్లాడేటప్పుడు మ్యాగ్జిమమ్ సైలెన్స్ ఉండాలి’ అని ట్రైలర్ చివరిలో సుదీప్ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.