calender_icon.png 23 February, 2026 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుంకాలకు ముకుతాడు!

22-02-2026 12:00:00 AM

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టాకా ఎడపెడా సుంకాల విధించి ప్రపంచ దేశాలను ఇబ్బందులకు గురి చేసిన డొనాల్డ్ ట్రంప్ చర్యలకు ఆ దేశ సుప్రీంకోర్టు ముకుతాడు వేసింది. రాజ్యాం గ నిబంధనల ప్రకారం అమెరికా చట్టసభలు (కాంగ్రెస్) అనుమతి లేకుండా అధ్యక్ష హోదాలో వివిధ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్లుబాటు కావని తీర్పునివ్వడం ముదావహం.

ఒక దేశాధ్యక్షుడిగా అత్యవసర అధికారాల చట్టాన్ని వినియోగించి ప్రతీకార సుంకాలు విధించడాన్ని కూడా సుప్రీం కోర్టు తప్పుబట్టింది. తాజా తీర్పుతో భారత్ సహా ఇతర దేశాలతో అమెరికా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలన్నీ నిరర్థకంగా మారనున్నాయి.అయితే సుంకాల విధింపు చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ట్రంప్ సర్కార్‌కు కొత్త చిక్కులు మొదలయ్యాయి.

అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా సుంకాల రూపంలో ట్రంప్ సర్కార్ వసూలు చేసిన మొత్తం విలువ దాదాపు రూ. 16 లక్షల కోట్ల పైమాటే. సుంకాల వల్ల ఇప్పటివరకు అధిక ధరలు చెల్లించిన అమెరికా వినియోగదారులు తమకు రీఫండ్  చేయాలని దిగుమతిదారులు కోర్టులను ఆశ్రయించారు. కానీ ఇది అంత సులభతరమైన ప్రక్రి య కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే తాను విధించిన సుంకాల భారం విదేశీ ఎగుమతిదారులపై తప్ప సామాన్య అమెరికన్లు, అమెరికా దిగుమతిదారులపై లేదని ట్రంప్ చెప్పుకుంటూ వచ్చారు. నిజానికి అధిక సుంకాల భారాన్ని సామాన్య అమెరికన్లే భరించాల్సి వచ్చిందని ట్రంప్ రాజకీయ ప్రత్యర్థులు మండిపడ్డారు. కాగా సుంకాల డబ్బులో ఎంతో కొంత తిరిగిస్తామని ట్రంప్ వర్గం పలుమార్లు తెలిపింది.

కానీ సామాన్య ప్రజలకు నేరుగా రీఫండ్స్ అందే అవకాశాలు తక్కువేనని ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెస్సెంట్ తెలిపారు. రీఫండ్స్‌లో అధికభాగం దిగుమతిదారులు, అమెరికన్ కంపెనీలకే వెళుతుందని పేర్కొన్నారు. రీఫండ్స్ ప్రక్రియ కూడా సంక్లిష్టంగా ఉండే అవకాశముందని జస్టిస్ ఏమీ కోనీ బేరెట్, జస్టిస్ బ్రెట్ కేవనా హెచ్చరించారు. వేలకు పైగా ఉండే దిగుమతిదారుల రీఫండ్స్ అభ్యర్థనలను పరిశీలించడం కస్టమ్స్ శాఖకు భారంగా మారవచ్చు. అంతర్జాతీయ స్థాయిలోనూ ట్రంప్ సర్కారు సుంకాల విషయంలో పలు కేసులు ఎదుర్కొనే అవకాశాలున్నాయి.

అమెరికా సుప్రీంకోర్టు తీర్పుపై ప్రపంచ దేశాలు భిన్నంగా స్పందించాయి. సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పును పరిశీలిస్తున్నామని భారత్ తెలిపింది. అమెరికా మాత్రం భారత్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందం కొనసాగుతుందని, విధించిన సుంకాలను భారతే చెల్లిస్తుందని పేర్కొంది. టారిఫ్‌లపై సుప్రీం తీర్పును ఫ్రాన్స్, కెనడా స్వాగతించగా, ఈయూ కూటమి తీర్పు ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొంది.

పరిస్థితి ఎలా ఉన్నా అమెరికాతో వాణిజ్య బంధం కొనసాగుతుందని బ్రిటన్  తెలిపింది. మరోపక్క సుంకాలు చెల్లవని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ట్రంప్ వైఖరిలో మార్పు కనిపించలేదు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసి న ట్రంప్ వివిధ దేశాలపై సుంకాల విధింపులో వెనక్కి తగ్గేదే లేదన్నారు.

గతంలో తమతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న దేశాలపై 10 శాతం సుం కాలు విధిస్తూ ట్రంప్ ఉత్తర్వులపై సంతకాలు చేశారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. సుంకాలకు సంబంధించి ఇది తాత్కాలిక సర్దుబాటు మాత్రమేనని, గతంతో పోలిస్తే మరింత ఎక్కువ సుంకాలు విధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు వైట్‌హౌస్ స్పష్టం చేసింది.