ఎస్ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి
బీజేపీ ఓట్ల సవరణ పేరుతో ప్రశ్నించే గొంతుల ఓట్లను తొలగించే కుట్ర చేస్తుంది
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రుద్రంగి,(విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్‌ఏలు) నిర్వహించిన అవగాహన సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ... గతంలో 2002లో చేపట్టిన ఓటరు జాబితా సవరణ కార్యక్రమం తరహాలోనే ప్రస్తుతం ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ప్రతి ఓటరు తమ ఓటు పేరు బీఎల్‌ఓల వద్ద ఉన్న ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం అనుమానాస్పద లేదా పరిశీలన జాబితాలో చేర్చిన ఓట్లకు సంబంధించి ఆయా ఓటర్లకు బీఎల్‌ఏలు సమాచారం అందించాలని అన్నారు. ఓటరు జాబితాలో ఏదైనా కారణంతో పేరు లేకపోతే, సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపి గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులకు సమర్పించేలా ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారి వివరాలను కుటుంబ సభ్యులు బీఎల్‌ఏలకు అందించాలని చెప్పారు. అవసరమైతే కుటుంబ సభ్యులు అఫిడవిట్ రూపంలో సంబంధిత అధికారులకు వివరాలు సమర్పించాలని తెలిపారు.అనేక గ్రామాల్లో ఇప్పటికే 80 శాతానికి పైగా ఓటరు మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు. ఇటీవల నియోజకవర్గ స్థాయిలో బీఎల్‌ఏలకు శిక్షణ శిబిరాలు కూడా నిర్వహించామని చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ప్రతిపక్షాలకు చెందిన ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బీజేపీకి నచ్చని వారి ఓట్లను లక్షల సంఖ్యలో తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణలో కూడా సుమారు 80 లక్షల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా తమ ఓటు జాబితాలో ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోవాలని, ఓటు హక్కును కాపాడుకోవాలని విప్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చెర్మన్ చేలుకల తిరుపతి, గండి సర్పంచ్ గండి నారాయణ, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






