4వ దశ పోలింగ్‌పై మార్కెట్ కన్ను
రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలపైనా దృష్టి
ఈ వారం మార్కెట్ కదలికలపై నిపుణుల అంచనాలు
న్యూఢిల్లీ, మే 12: ఈ సోమవారం కీలక రాష్ట్రాల్లో జరిగే నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళి, ఇదే రోజున వెలువడే రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టినిలిపారని, అందుకు అనుగుణంగా ఈ వారం మార్కెట్ ట్రెండ్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతో కలిపి 96 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరుగుతాయి. గత మూడు దశల్లోనూ పోలింగ్ శాతం తక్కువగా నమోదుకావడంతో అధికార ఎన్‌డీఏ ముందస్తు అంచనాల ప్రకారం పెద్ద మెజారిటీ రాదని, దీంతో ఆర్థిక సంస్కరణలకు బ్రేక్ పడుతుందన్న భయాలు మార్కెట్లో వ్యాపించడంతో స్టాక్ సూచీలు వారం రోజులుగా పతనాన్ని చవిచూస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించి పొజిషన్లలో ఇన్వెస్టర్లు మార్పుచేర్పులు చేస్తున్నందున, ఇంట్రాడే ఒడిదుడుకులు కొనసాగవచ్చని విశ్లేషకులు వివరించారు.
తాజా దశ పోలింగ్‌కు తోడు ద్రవ్యోల్బణం గణాంకాలు సైతం మార్కెట్‌కు కీలకమేనని విశ్లేషకులు చెప్పారు. రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య విధానాన్ని ప్రభావితం చేసే ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం డేటా మే 13నే వెలువడుతుంది. ఏప్రిల్ నెలలో వినిమయ ద్రవ్యోల్బణం 4.8 శాతం మేర ఉండవచ్చని మెజారిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. 5 శాతాన్ని మించుతుందని కూడా కొద్దిమంది విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయ అంశాలతో పాటు అంతర్జాతీయ సంకేతాలు, పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి మార్కెట్‌కు ప్రధానాంశాలేనని, అందుకు అనుగుణంగా మార్కెట్ లావాదేవీలు జరుగుతాయని నిపుణులు చెపుతున్నారు. విదేశీ ళి లోక్‌సభ ఎన్నికలు, ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు ఈ వారం ట్రెండ్‌ను నిర్దేశించే అంశాలివి.
అంతర్జాతీయ మార్కెట్లు: అమెరికాలో పెద్ద టెక్నాలజీ షేర్లు పటిష్ఠమైన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించడంతో గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగానే ట్రేడవుతున్నాయి. వరుసగా రెండో వారమూ యూఎస్ మార్కెట్ పాజిటివ్‌గా ముగిసింది. యూస్ బాండ్ ఈల్డ్స్, డాలరు తగ్గుముఖం పట్టడం మార్కెట్‌కు బలాన్ని ఇచ్చింది. గ్లోబల్ ట్రెండ్స్ సైతం వచ్చేవారం భారత్ మార్కెట్‌పై సైతం ప్రభావం చూపిస్తాయని స్వస్తికా ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ తెలిపారు.
కార్పొరేట్ ఫలితాలు: ఈ వీకెండ్‌లో వెల్లడైన టాటా మోటార్స్ ఫలితాలపై సోమవారం ట్రేడింగ్ ప్రారంభంకాగానే మార్కెట్ స్పందిస్తుంది. టాటా మోటార్స్ నికరలాభం మార్కెట్ అంచనాలకు మించి 46 శాతం వృద్ధిచెందిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారం ఎంఅండ్‌ఎం, భారతి ఎయిర్‌టెల్, గెయిల్, జీఎస్‌డబ్ల్యూ స్టీల్ తదితర దిగ్గజ కంపెనీల ఫలితాలు సూచీల ట్రెండ్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు చెపుతున్నారు.






