15 April, 2026 | 4:42 AM

క్రికెటర్‌తో మ్యాచ్ గెలిచిన హీరో విజయ్ దేవరకొండ

06-05-2025 09:54 PM

రౌడీ హీరోగా ప్రేక్షక హృదయ సామ్రాజ్యంలో స్థానం పదిలపర్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఆయన ‘కింగ్‌డమ్’ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో అభిమానుల్లో మరింత జోష్ నింపేందుకు ప్రమోషన్‌ను సరికొత్తగా ముందుకు తీసుకెళ్తున్నారు కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఈ నేపథ్యంలోనే విజయ్.. తాజాగా ముంబయి ఇండియన్స్ క్రికెటర్ తిలక్‌వర్మతో కలిసి పికిల్‌బాల్ మ్యాచ్ ఆడారు.

ఈ మ్యాచ్ బెస్ట్ ఆఫ్ త్రీలో తనను ఓడిస్తే ముంబయి ఇండియన్స్ జెర్సీ వేసుకుంటానని తిలక్‌వర్మకు విజయ్ దేవరకొండ ఛాలెంజ్ విసిరారు. ఈ మ్యాచ్‌లో విజయ్ టీమ్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో ముంబయి ఇండియన్స్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అదిప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోకు పెద్ద ఎత్తున నెటిజన్స్, సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. విజయ్ కూడా స్పందిస్తూ తన కొత్త సినిమా ‘కింగ్‌డమ్’లోని ‘హృదయం లోపల’ సాంగ్‌కు రీల్ చేయాలని తిలక్‌వర్మ, రాజంగడ్‌ను కోరారు.

హైదరాబాద్‌లో జరిగే ప్లేఆఫ్స్‌కు వస్తానని, ముంబయి టీమ్‌ను సపోర్ట్ చేస్తానని తెలిపారు. ‘కింగ్డమ్’ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. దీన్ని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందించారు. ఈ సినిమా మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.