26 August, 2026 | 2:03 PM

నగలు.. నగదు.. బాండ్ల అప్పగింతకు హైకోర్టు నిరాకరణ

14-03-2025 01:44 AM

గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన కుమారుడు, కుమార్తె పిటిషన్లు కొట్టివేత

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో భాగంగా తన ఇంటి నుంచి సీబీఐ స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలతో పాటు నగదు, రూ.5 కోట్ల విలువైన బాండ్లను తమకు అప్పగించాలని, లేకపోతే నగలు తప్పుపట్టే ప్రమాదం ఉందని, నగదు, బాండ్లు పాడైపోయే అవకాశం ఉందని నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన కుమార్తె బ్రాహ్మణి, కుమారుడు కిరిటీరెడ్డి అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది.

కేసు విచారణ పూర్తయ్యాకే వాటిపై హక్కులు తేల్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ పిటిషన్లను కొట్టివేసింది. నగలు, నగదు, పొదుపు బాండ్ల అప్పగింతకు సీబీఐ కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ గాలి జనార్దన్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు, కుమార్తె హైకోర్టు ఆశ్రయించారు. పిటిషన్లపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు.

నగలు, నగదు, బాండ్లుకు సంబంధించిన ఎలాంటి పత్రాలను పిటిషనర్లు సమర్పించలేదని, కాబట్టి.. కేసు సీబీఐ విచారణలో ఉండగా నగలు, నగదు అప్పగింతను నిరాకరిస్తూ కింది కోర్టు వెలువరించిన ఉత్తర్వులు సబబేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టు జోక్యం అవసరంలేదని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేశారు.