11 April, 2026 | 2:57 AM

సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం

11-04-2026 12:55 AM

కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

హన్మకొండ, ఏప్రిల్ 10(విజయక్రాంతి): సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పరిపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా హనుమకొండ జిల్లాలో వైద్య ఆరోగ్య, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత యోగ శిబిరం,యోగ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి హాజరై ప్రారంభించి, స్వయంగా యోగాసనాలు వేశారు.   హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానీమన్ జయంతి, ఆయుష్ దినోత్సవం సందర్భంగా వడ్డేపల్లి పార్క్లో ఆయన చిత్ర పటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉచిత హోమియో, ఆయుర్వేద వైద్య సేవలతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు.

ఈ శిబిరాన్ని కార్పొరేటర్ దాస్యం అభినయ భాస్కర్ ప్రారంభించగా, డిఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య  ఆయుష్ వైద్య సేవల విశిష్టతను వివరించారు. అనంతరం వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా హోమియో, ఆయుర్వేద మందులను అందజేశారు. ఈ శిబిరంలో మొత్తం 453 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ ఎస్. మహేంద్ర కుమార్, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భాను కుమార్, డిపిఆర్‌ఓ ఆయుబ్ అలీ, వైద్యులు డాక్టర్ జగదీశ్వర్ ప్రసాద్, డాక్టర్ రజిత, డాక్టర్ శోభ, డాక్టర్ కిరణ్ కుమార్, ఫార్మసిస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.