ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు
మంగపేట, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేది ఎన్నడో ?, కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ధాన్యం, వాతావరణం మార్పుతో అన్నదాతల ఆందోళన అంటూ బుధవారం విజయక్రాంతి దిన పత్రికలో వచ్చిన కధనానికి అధికారులలో కదలిక వచ్చింది.
దీంతో జిల్లా పౌర సరఫరాల అధికారులు శుక్రవారం మండలంలోని అకినేపల్లి మల్లారంలో వివేకా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల అధికారి సయ్యద్ షా ఫైసల్ హుస్సేని మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు.
ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కృష్ణవేణి, పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, మంగపేట తహసీల్దార్ తోట రవీందర్, మంగపేట ఎస్త్స్ర టీవీఆర్ సూరి, ఎంపీడీవో బద్రు నాయక్, జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. కాగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంజాప్యం కావడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యేలా చేసిన విజయక్రాంతి దిన పత్రికకు మండల రైతులు కృతజ్ఞతలు తెలిపారు.




