కాలనాగులతో జాగ్రత్త
- 2028లో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే
- రాష్ట్ర భవిష్యత్తుపై బీఆర్‌ఎస్‌కు మాత్రమే విజన్ ఉంది
- తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రవాసీయులు కలిసిరావాలి
- మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): అద్భుతమైన చరిత్ర, సంస్కృతి కలిగిన మనందరం ‘నాది తెలంగాణ, నాది తెలంగాణ జాతి, నేను తెలంగాణ బిడ్డను’ అని సగర్వంగా చెప్పుకోవాలని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ జాతిలో ప్రతి తరం ఏదో ఒక యు ద్ధాన్ని, రణాన్ని నడిపించిందని గుర్తుచేశారు.
భక్త రామదాసు (కంచర్ల గోపన్న) నుంచి గోరటి వెంకన్న దాకా దిక్కార స్వరాన్ని వినిపించిన ప్రజా కళాకారుల నుంచి మొదలు కొని ప్రజానాయకులు ఎందరినో కన్న ఈ గడ్డ అత్యంత ప్రత్యేకమైనదన్నారు. ప్రకృతితో మమేకమై బతుకమ్మను జరుపుకునే, పువ్వులను పూజించి ప్రకృతిని ఆరాధించే ఒకే ఒక్క జాతి ఈ ప్రపంచంలో తెలంగాణ జాతి అని ఆయన స్పష్టం చేశారు. మలేషి యా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి.
మలేషియా తెలుగు అసోసియేషన్, బీఆర్‌ఎస్ ఎన్నారై మలేషియా శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ సంబరాలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తు న్న ప్రవాస తెలంగాణ బిడ్డలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉన్న ఊరును, కన్న తల్లిని మర్చిపోకుండా ఖండాలు దాటినా తెలంగాణ తల్లిని తలుచుకుంటూ ఆవిర్భావ దినోత్సవాలను ఇంత ఘనంగా జరుపుకోవడం గొప్ప విషయమని కొనియాడారు.
కేసీఆర్ నాయకత్వంలోనే సాకారం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నదని, అయితే ఈ ప్రత్యేక రాష్ట్రం ఊరికేనే రాలేదని కేటీఆర్ గుర్తుచేశారు. దశాబ్దాల పాటు జరిగిన తొలి తెలంగాణ ఉద్య మం, ఆ తర్వాత కేసీఆర్ సారథ్యంలో జరిగి న మలి తెలంగాణ ఉద్యమంతోనే ఇది సాధ్యమైందన్నారు. అనేక పదవీ త్యాగాలు, సవాళ్లను దాటుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. భారతదేశంలో చిన్న రాష్ట్రమైన తెలంగాణ సైతం అత్యంత తక్కువ కాలంలోనే అద్భుతమైన విజయాలను సాధించిందన్నారు.
ఒకనాటి వలసల తెలంగాణను, కరువుల తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. ఒకనాడు అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా పేరున్న తెలంగాణను ఆర్థిక అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపి, తలసరి ఆదాయంతో పాటు స్థూల జీఎస్డీపీలోనూ ప్రథమ స్థానానికి చేర్చామన్నారు. ఒకప్పుడు గేలి చేయబడిన తెలంగాణ సంస్కృతిని ఈనాడు సగర్వంగా ప్రపంచానికి చాటిచెప్పింది కూడా ముమ్మాటికీ కేసీఆరే అన్నారు.
భవిష్యత్ కార్యాచరణ ఇదే
రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా 24 గంటల పాటు స్వచ్ఛమైన మంచినీటిని నిరంతరం సరఫరా చేయాలన్నదే తమ ప్రధాన విజన్ అని కేటీఆర్ ప్రకటించారు. ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ఆ దిశగా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రవాస భారతీయులంతా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ’మై టా’ అధ్యక్షుడు తిరుపతి, బీఆర్‌ఎస్ మలేషి యా అధ్యక్షుడు మారుతి, బీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్, శంబీపూర్ రాజు, రాజ్యసభ మాజీ సభ్యులు బడుగుల లింగయ్య యాద వ్, పార్టీ సీనియర్ నాయకులు నంద్యాల దయాకర్‌రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, పార్టీ జనరల్ సెక్రెటరీ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే కిషోర్, నాగేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
రాబోయే 25 ఏళ్లకు ప్రత్యేక విజన్
మలేషియా మాదిరే తెలంగాణలోనూ పామాయిల్ విప్లవం సాధించి, రైతన్నల వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న ఏకైక ఉద్దేశంతో పామాయిల్ కోసం మలేషియా నుంచి విత్తనాలు, మొక్కలు తీసుకువచ్చి తెలంగాణలో నాటించిన అంశాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఫలితంగా ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా పామాయిల్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందన్నారు.
ఒకనాడు అణ్వాయుధాలు ఉన్నవాడు నాయకుడైతే, ఈరోజు విజ్ఞానం, ఆలోచన ఉన్నవాడే అగ్రస్థానంలో నిలబడుతున్నారన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రానికి ఎన్నారైల సేవలు కావాలని, తెలంగాణ అభివృద్ధికి వారి సూచనలు, భవిష్యత్తుకు ప్రవాసుల మద్దతు అవసరమని విజ్ఞప్తి చేశారు. 10 సంవత్సరాల పాటు వెనుకబడిన తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్‌కు, భారత రాష్ట్ర సమితికి వచ్చే 25 సంవత్సరాల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఒక ప్రత్యేక విజన్ ఉందన్నారు.






