7 June, 2026 | 1:56 AM

మోదీ దిగిపో..

07-06-2026 12:36 AM
  1. రాహుల్‌గాంధీని ప్రధానిని చేసుకుంటాం.. రాష్ట్రానికి నిధులు తెచ్చుకుంటాం 
  2. బండి సంజయ్, కిషన్‌రెడ్డి తమాషా చేస్తున్నరు 
  3. ధాన్యం కొనకుంటే మీ సంగతి చూస్తా 
  4. మర్యాద తప్పితే.. పొలిమేరలు కూడా దాటనివ్వం 
  5. కేసీఆర్ హయాంలో విధ్వంసం 
  6. మేం వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
  7. రంగారెడ్డి జిల్లా కోహెడలో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్‌కు శంకుస్థాపన 
  8.    2,284 కోట్ల రూపాయలతో 239 ఎకరాల్లో నిర్మాణం

రంగారెడ్డి, జూన్ 6 (విజయక్రాంతి): తెలంగాణను పట్టించుకోని మోదీ గద్దె దిగాలని, రాహుల్‌గాంధీని ప్రధాని చేసుకుని రాష్ట్రానికి నిధులు తెచ్చకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రం ధాన్యం కొనాలని కోరితే వినకుండా బండి సంజయ్, కిషన్‌రెడ్డి తమాషా చేస్తున్నారని, వడ్లు కొనకుంటే మీ సంగ తి చూస్తామని హెచ్చరించారు. మర్యాద తప్పితే పొలిమేరలు కూడా దాటనివ్వబోమన్నారు. కేసీఆర్ హయాంలో విధ్వం సం సృష్టిస్తే తాము రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

శనివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ లో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. 2,284 కోట్లతో 239 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కాంప్లె క్స్‌కు కూడా సీఎం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మా ట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో విధ్వం సం చేస్తే తాము వికాసం వైపు నడిపిస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు అసూయ, పగ తమపై చూపండని.. కానీ ప్రజలపై కాదన్నారు.

సమస్య లు వస్తే పారిపోమని.. నిలబడి కొట్లాడి పరిష్కరించుకుంటామని అన్నారు. ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధమని వ్యాఖ్యానిం చారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సంగతి చెపుతామని హెచ్చరించారు. మోదీని చూపి భయపెట్టాలనుకుంటే తాము భయపడేవారం కాదన్నారు. ఈ నెల 15వ తేదీ తర్వాత వడ్లు కొనకుంటే మోదీ సర్కార్ సంగతి చూస్తామని హెచ్చరించారు.

కేంద్రం నుంచి నిధులు ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసునని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసి రాష్ట్రానికి నిధులు తెచ్చుకుంటామన్నారు. తెలంగాణ పంటలను కొనిపించడంతో పాటు, పాలమూ రు ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఆర్‌ఆర్‌ఆర్‌కు పూర్తి అనుమతులు తెచ్చుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకరయ్య, నవీన్‌యాదవ్, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ సి నారాయణరెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. 

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా..

రాష్ట్రంలో భూముల ధరలు పెరుగడంతో.. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెంది వ్యవసాయం కుంటుపడిందని సీఎం అన్నారు. హైదరాబాద్ నగరంలో 1.34 కోట్ల మంది నివసిస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు హైదరాబాద్ చుట్టూ కూరగాయలు పండేవని చెప్పారు. నగర ఆహార అవసరాలను తీర్చడానికి మౌలిక వసతుల ఆధు నీకరణ అత్యంత అవసరమన్నారు.

కేవలం వరి, జొన్న, పత్తి వంటి సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా పండ్లు, కూరగా యల ఉత్పత్తిని పెంచాలని, కందుకూరు ప్రాంతంలో పండే టమోటాల ఆధారంగా త్వరలోనే సాస్ తయారీ పరిశ్రమను ఏర్పా టు చేస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు ’గ్రీన్ ఛానల్’ ద్వారా నిధులు విడుదల చేస్తామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికే మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

గడ్డిఅన్నారం నుంచి ఫ్రూట్ మార్కెట్‌ను కోహెడకు తరలించి రేకుల షెడ్లు వేస్తే అవి గాలి దుమా రానికి ఎగిరిపోయాయని అన్నారు. అప్పు డు ఎంపీగా ఉన్న తాను.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయి లో మార్కెట్ నిర్మిస్తామని హామీ ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు అందరి అవసరాలు తీర్చేలా మార్కెట్ నిర్మాణం చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తో ఏటా రూ.8 వేల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. 

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మార్పులు..

ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు అవుటర్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి, అన్ని వసతులతో కూడిన సమీకృత ఆధునిక కార్యాలయ సముదాయాలను నిర్మిస్తు న్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్రానికి భారీగా వస్తున్న ఆదాయానికి అనుగుణంగా ప్రజలకు తాగునీరు, కూర్చునే స్థలం వంటి మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. 

కారు కార్ఖానాలో పడింది..

రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవాలని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ చూస్తున్నదంటూ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘బీఆర్‌ఎస్ అనే ’కారు’ పూర్తిగా చెడిపోయి కార్ఖానాలో పడింది, దానికి ఎన్ని మరమ్మతులు చేసినా ఇక పనికిరాదు. కుర్చీ వేసుకు ని కూర్చొని పాలమూ-రంగారెడ్డి పూర్తి చేస్తానన్న కేసీఆర్ గెలిచాక పట్టించుకోలేదు. కాలుష్యం వెదజల్లే ఫార్మాసిటీ స్థానంలో మేం అంతర్జాతీయ స్థాయిలో ’భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మిస్తుంటే, అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామని బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆ అష్టదరిద్రులు కాళ్లలో కట్టెలు పెట్టినా, మూసీలో పడి దొర్లినా రీజనల్ రింగ్ రోడ్ , ఫ్యూచర్ సిటీ పనులు ఆగవు. ఇలాగే ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో ఆ కారును తోయడానికి కూడా ఎవరూ దొరకరు,‘ అని హెచ్చరించారు. కాళేశ్వరంలో చుక్కనీరు ఎత్తిపోయకుండా లక్షల మెట్రిక్ టన్నుల పంట పండలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ నీళ్లున్నా కాళేశ్వరం నీళ్లు అనేవారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిందని విమర్శించారు.

కేసీఆర్ హయాంలో కాళేశ్వరానికి రూ.లక్ష కోట్లు వెచ్చిస్తే గోదావరి పాలయ్యాయని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్నా, రికార్డు స్థాయిలో ధాన్యం పండించా మని.. వరి వేస్తే ఉరే అనే రోజులు పోయి, ప్రతి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు.

రైతులకు రూ. 20 వేల కోట్ల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు జారీ చేసి, 3.28 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.