7 June, 2026 | 2:20 AM

ఇంకా ఎంత మంది విద్యార్థులు చావాలి

07-06-2026 12:47 AM
  1. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
  2. మేక్ ఇన్ ఇండియాను లీక్ ఇన్ ఇండియా చేశారు
  3. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆగ్రహం
  4. సీజేపీ ధర్నాతో దద్దరిల్లిన జంతర్‌మంతర్
  5. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, మద్దతుదారులు
  6. లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు
  7. వాంగ్‌చుక్‌ను విద్యామంత్రిని చేయాలన్న నిరసనకారులు 
  8. ఢిల్లీ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం

* కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) శనివారం నిర్వహించిన ధర్నాతో ఢిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్‌మంతర్ దద్దరిల్లింది. దేశంలోని నలుమూలల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సీజేపీ మద్దతుదారులు, పోటీపరీక్షల అభ్యర్థులు వేలాదిగా తరలివచ్చిన ఈ ధర్నాలో అమెరికాలోని బోస్టన్ నుంచి ఢిల్లీకి వచ్చిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రసంగంతో ఆ ప్రాంతమంతా నిరసనలతో హోరెత్తింది.

లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఈ నిరసనలకు మద్దతు తెలిపి, స్వయంగా పాల్గొన్నా రు. నీట్ పేపర్, సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం లీక్‌లపై కేంద్ర ప్రభుత్వంపై పశ్నల వర్షం కురిపించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకూ ఈ ఉద్యమం కొనసాగుతదని, విద్యాశాఖలో జవాబుదారీ తనం ఏదని, విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలని నినదించారు. ఇంకా ఎంతమంది విద్యార్థులు చావాలని నిలదీశారు.

న్యూఢిల్లీ, జూన్ 6: విధ్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) డిమాండ్ చేసింది. ఇంకా ఎంత మంది విద్యార్థులు చస్తే పాలకులు, అధికారులు స్పందిస్తారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిలదీశారు. నీట్ పేపర్, సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం లీక్‌లపై ప్రశ్నల వర్షం కురిపించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకూ ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు.

తమ పిల్లలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే, వారి భవిష్యత్ ఏమవుతుందోనన్న భయం ఈ దేశంలోని ప్రతి తల్లికీ ఉంటుంది. ఈ ప్రభుత్వానికి భయపడి ఎంతకాలం బతకాలి?’ అని ఆయన ఆగ్రహించారు. ‘మేము మేక్ ఇన్ ఇండియాను అడిగితే.. మీరు లీక్ ఇన్ ఇండియా’ చేశారని, లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను విద్యామంత్రిని చేయాలని, ప్రభుత్వంలో జవాబుదారీ తనం ఏదీ? అని సీజేపీ ధర్నాకు వేలాదిగా తరలొచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, మద్దతుదారులు, పోటీపరీక్షల అభ్యర్థులు నినదించారు.

విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను పరిష్కరించేందుకు ప్రస్తుత విద్యా వ్యవస్థను సంస్కరించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అభిజీత్‌దీప్కేను అరెస్ట్ చేస్తే ఆరువారాల పాటు నిరాహార దీక్ష చేస్తామని వాంగ్‌చుక్ హెచ్చరించారు. బొద్దింక జనతా పార్టీ (సీజేపీ) మద్దతుదారులు శనివారం నిర్వహించిన ధర్నాతో ఢిల్లీలోని జంతర్ మంతర్ దద్దరిల్లింది. ఢిల్లీ వ్యాప్తంగా శుక్రవారం నుంచే భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు ఈ నిరసనకు శనివారం అనుమతించారు.

దాదాపు 1000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం నిర్వహించిన భారీ నిరసనకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నాయకత్వం వహించారు. జంతర్మంతర్ నిరసనల్లో పాల్గొనేందుకు ఆయన అమెరికాలోని బోస్టన్ నుంచి ఢిల్లీకి వచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్రను చేతితో పట్టుకుని కనిపించారు. ఈ సందర్భంగా  ‘ఎక్స్’ వేదికగా దీప్కే ఒక పోస్టు చేశారు.

జంతర్ మంతర్ వద్ద మద్దతుదారులను కలవడానికి ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. అలాగే, వారు తమతో పాటు ఒక పుస్తకాన్ని, జాతీయ జెండాను తీసుకురావాలని సూచించారు. ‘కరుణ, కృతజ్ఞతా భావంతో’ పోలీసు సిబ్బందికి పూలు అందించాలని కోరిన ఆయన, ఈ ఉద్యమాన్ని ‘ప్రేమ శాంతి’తో నడపాలని స్పష్టం చేశారు. అనంతరం ఆయన నేరుగా జంతర్‌మంతర్‌కు వెళ్లారు. లడఖ్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు ప్రకటించి, ఈ ధర్నాలో పాల్గొని, తన గళాన్ని వినిపించారు.

సీజేపీ మద్దతుదారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పోటీపరీక్షల అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలొచ్చారు. ఇది సుదీర్ఘ పోరాటమని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ఆరంభం మాత్రమేనని సీజేపీ స్పష్టం చేసింది. విద్యా శాఖలో జవాబుదారీతనం లేదని నిరసనకారులు నినదించారు. ఇది సుదీర్ఘ పోరాటమని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ఆరంభం మాత్రమేనని సీజేపీ స్పష్టం చేసింది. కాగా, తదుపరి నిరసన ప్రదర్శనను జూన్ 23న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించే ఆలోచనలో సీజేపీ ఉంది.

ఇంకెంత మంది ఆత్మహత్యలు చేసుకోవాలి?: సీజేపీ అభిజీత్ దీప్కే

సీజేపీ మద్దతుదారులను ఉద్దేశించి అభిజీత్ దీప్కే మాట్లాడుతూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ నిరసనలు కొనసాగుతాయని ప్రకటించారు. ఇంకెంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేంత వరకూ అధికారులు వేచిచూస్తారని నిలదీశారు. తమ డిమాండ్ల నెరవేరేంత వరకూ ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు. నిరసనలకు దిగితే జైలులో పెడతారేమోనని తన తల్లి భయపడినట్టు దీప్కే చెప్పారు.

‘తమ పిల్లలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే ఏమవుతుందోనన్న భయం ఈ దేశంలోని ప్రతి తల్లికి ఉంది. ఈ ప్రభుత్వానికి భయపడి ఎంతకాలం బతకాలి?’ అని ఆయన ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని నెలరోజుల నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ చర్చలు తీసుకోవడం లేదని, దీనికి బదులు ఇతర అంశాలపైనే వాళ్లు దృష్టి పెట్టారని అన్నారు.

సీజేపీ అకౌంట్లు హ్యాక్ చేయడం, పోస్టులు డిలీట్ చేయడం చేస్తున్నారని చెప్పారు. పోస్టులను డీలీట్ చేయవచ్చు కానీ, తమను ఏమార్చలేరని అన్నారు. పేపర్ లీక్లు, విద్యావ్యవస్థలో తప్పిదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల పేర్లను ఆయన చదవి వినిపించారు. విద్యార్థుల మృతికి సీజేపీ సంతాపం ప్రకటించింది. 

విద్యాశాఖను వాంగ్‌చుక్ చేపట్టాలి

జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉండాలని కోరారు. అయితే తనకు రాజకీయాల్లో ప్రవేశించాలే ఆలోచన లేదని వాంగ్చుక్ స్పష్టం చేశారు. యువకులే ఆ బాధ్యత చేపట్టాలన్నారు.

రాజకీయవేత్తలు, ప్రభుత్వ అధి కారుల పిల్లలు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదవాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. సీజేపీ నిరసనలకు ప్రభుత్వం అనుమతించాన్ని ఆయన స్వాగతించారు. నిరసన తెలపడం తనకు ఇష్టం లేకున్నా న్యాయం కోసమే ఆ పని చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థలో మార్పు జరగాలని అన్నారు. ఒకవేళ దీప్కేను అరెస్టు చేస్తే తాను ఆరు వారాల పాటు నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు.

 ఢిల్లీ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం

బొద్దింకల జనతా పార్టీ(సీజేపీ) నిరసన పిలుపు నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. డిజిటల్ సంస్థ అయిన సీజేపీ తలపెట్టిన నిరసన పిలుపు నేపథ్యంలో శనివారం ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయం, సరిహద్దు ప్రవేశ మార్గాలు, ఇతర కీలక ప్రదేశాలలో పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు.

ఈ నిరసన కోసం అనుమతి కోరుతూ పోలీసులకు ఎలాంటి అధికారిక అభ్యర్థన అందలేదని, అయితే సోషల్ మీడియా పర్యవేక్షణ, ఇతర మార్గాల ద్వారా అందిన సమాచారం ఆధారంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందుజాగ్రత్త భద్రతా చర్యలలో భాగంగా, న్యూఢిల్లీ జిల్లా వ్యాప్తంగా, ఇతర వ్యూహాత్మక ప్రదేశాలలో వెయ్యి మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించినట్లు పోలీసులు తెలిపారు. ఐజీఐ విమానాశ్రయం, ప్రధాన రైల్వే స్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినళ్లు, ఢిల్లీని పొరుగు రాష్ట్రాలతో కలిపే సరిహద్దు పాయింట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు.

అంతర్జాతీయ మీడియాలోనే ప్రాధాన్యం?

జంతర్ మంతర్ వద్ద ధర్నాను కవర్ చేయడానికి వచ్చిన మోదీ అనుకూల మీడియాను ఆందోళనకారులు ఎండగట్టినట్లు సమాచారం. ‘గోబ్యాక్ మోదీ మీడియా’ అంటూ నినాదులు చేసినట్లు తెలిసింది. దీంతో కొన్ని చాన్నళ్లు కవర్ చేయకుండానే వెనక్కి వెళ్లాయి. మరోపక్క ఈ ధర్నా జాతీయ మీడియాలో పెద్దగా కవర్ కాలేదు. అదేసమయంలో అంతర్జాతీయ మీడియాలో అధిక ప్రాధాన్యం లభించింది. కాషాయం ధరించిన కొందరు ఈ నిరసన కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు.

యువతకు సంబంధించిన ఈ సమస్యల్లోకి మతరాజకీయాలను ముఖ్యంగా ఉమర్ ఖలీద్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉద్రిక్త వాతావరణం సృష్టించేందుకు యత్నించారు. వారికి యువత మాటలతోనే ఘాటుగా సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు కాషాయం ధరించిన వారిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.