తేనెబూసిన కత్తి
తాటి చెట్టెక్కురా తనయుడా అని తోయు
తండ్రులున్నను కొడుకు తట్టుకోడు
ఎమ్మెల్లె టికెట్టు ఎట్లైనా సాధించి
ఇచ్చినా వెయ్యోట్లు తెచ్చుకోడు
మరుసటెన్నికలోన మాయొపాయము జేసి
ఎంపీకి నిలబెడ్తె కంప జేయు
ఎటనుండి ఎటొదిప్పి ఎమ్మెల్సి జేయిస్తె
తిండి తాగుడు తోటి ముండమోపు
జీలు ఉంటెనే ఏదైనా మేలు గాని
ఉత్త లేపుడుతో నెవ్వడుర్కిగెల్చు
నన్న దృష్టాంతమున్నదా ఎన్న చరిత
ననెడు యోచన లేదు ఏ నేతకైన
మాయమాటల హామీలమర్మమెరిగి
గుర్తు లేకుండ ఓటెట్ల గుద్దుతావు
ఓరి వెంకన్న! దోస్తుగా ఒర్లుబోతు!
ఒక్క మాటన్న వినవార! తిక్కలోడ!
తేనెబూసిన కత్తి తెర్లుగావలె గాని
అది ఏమి సిత్రమో అచ్చివచ్చు
మేడిపండుకు మెర్పు మూడు నాళ్ళేగని
నూరేళ్ళ పండుగన్ మురిసిపోవు
మిరప రంగును జూసి మెరుపంటు భ్రమలేల
గాంచ వలసిందందు ఘాటుగాని
ఎక్కుపెట్టిన గన్ను ఎటు పేలునో జెప్ప
ఎవ్వాని తరమౌను ఎట్లు జెప్ప
హద్దు పద్దులు లేకుండ అతిగ పోతె
ప్రజలె నిలదీతు రొకనాడు పట్టి కుదిపి
అన్ని గుంపులు అతి నిద్రనున్నగాని
పాఠములు జెప్పనొకసారి ప్రకృతియును
మాయ మాటల హామీల మర్మమెరిగి
గుర్తు లేకుండ ఓటెట్ల గుద్దుతావు
ఓరి వెంకన్న! దోస్తుగా ఒర్లుబోతు!
ఒక్క మాటన్న వినవార! తిక్కలోడ!
ఏనుగు నరసింహారెడ్డి
సెల్: 8978869183






