మన విశ్వగురువు
ఎక్కడ మనసు భయం లేకుండా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తుకొని తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా అందించబడుతుందో, ఎక్కడ ప్రపంచం ఇరుకు గోడలమధ్య ముక్కలుగా విడిపోలేదో, ఎక్కడ సత్యపు లోతుల్లో నుంచిమాటలు వెలుపలికి వస్తాయో, ఎక్కడ విరామం లేని అన్వేషణ పరిపూర్ణతవైపు సత్కార్యాలు సాగుతాయో, ఎక్కడ ప్రజలు విశాలభావాలతో, సత్‌క్రియలతో నడుస్తారో అక్కడికి నా దేశాన్ని నడుపు తండ్రీ!
గీతాంజలి
ఆధునిక ప్రపంచ మహాపురుషులలో అగ్రగణ్యులు, గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ కవిగా, గాయకుడి గా, మహాకవిగా, మహర్షిగా, వక్తగా, ప్రవక్తగా, త్యాగిగా, భోగిగా తన జీవితానికి సమగ్రతను సాధించుకున్నాడు. దానితో ప్రపంచ విజ్ఞానానికి తేజస్సును, ఓజస్సును సంతరింప జేశాడు. రత్నాల గనిలో రత్నమే లభించినట్టు రవీంద్రుడు ఠాగూర్ వంశగనిలోని జాతి రత్నం. ‘అచట పుట్టిన చివురు కొమ్మన చేవ’ అనే నానుడికి నిదర్శనం వారి వంశం. ఠాగూర్ కుటుంబం అసలు ఇంటిపేరు కుషారి. బెంగాలీ భాషలో ‘ఠాగూర్ ’అంటే గౌరవ ప్రదమైన ‘అయ్యా’ అని అర్థం.
రవీంద్రుని తాత రాజా ద్వారకానాథ్ ఠాగూర్. ఆనా టి కలకత్తా ధనవంతులలో వీరు దయాశీలి. అప్పటి అభ్యుదయోద్యమాలన్నింటి పట్ల సానుభూతి కలవారు. తన భూములలో పండిన రాశులకొద్ది ధాన్యాన్ని పేదసాదలకు పంచేవారు. వీరిలోని మరో సుగుణం జాతీ యతా పరిరక్షణ. కొడుకు మహర్షి దేవేంద్రనాథ్. తండ్రి ఆస్తిపాస్తులకే కాక సద్గుణాలకు, ధర్మ తత్పరతకు వారసుడు కనుకే ‘మహర్షి’ అనే బిరుదును పొందాడు. వీరి కడుపున పండిన బంగారు పంటయైన 13 మంది తర్వా త రవీంద్రుడు చివరివాడు. 1861 మే 7న జన్మించాడు.
ఎనిమిదో ఏటే కవిత్వం
చిన్నతనంలో రవీంద్రునికి ఉపాధ్యాయుల కఠిన శిక్షలు నచ్చలేదు. దాంతో బడి మానేశాడు. ఇంటివద్దే బోధన ఏర్పరిచారు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి వెళ్లి ప్రకృతిని చూసి పరవశించి పోయేవాడు. వీరి సోదరులంతా సాహిత్యకారులు, నాటక కళాకారులు, విద్యావే త్తలు లలితకళా ప్రియలు. వారందరి కళాస్ఫూర్తి వీరిపై పొడ సూపింది. బోధకుడు వింత వస్తువులను చూపు తూ పాఠాన్ని చెప్తున్నప్పుడు రవీంద్రుడు పరవశించి పోయేవాడు. ఉపాధ్యాయునికి జ్వరం తగిలి రాకుంటే బాగుండునని వేయి దేవుళ్ళకు మొక్కుకునేవాడు.
కుంభవృష్టి కురిసినా అతడు గొడుగు వేసుకొని చదువు చెప్ప టానికి వచ్చేవాడు. అందుకు మరో మార్గంగా ఉపాధ్యాయుడు వచ్చే సమయానికి ‘అమ్మా కడుపు నొప్పి’ అని మూల్గేవాడు. బిడ్డ మనసు తెలుసుకొని అతన్ని పీడించి చదివించేది కాదు ఆ తల్లి. చిన్ననాటి నుండి పద్యాలు అల్లడంలో రవీంద్రునికి ఎక్కువ మక్కువ. ఎనిమిదేళ్ల వయసులోనే ఒక ఫ్రెంచ్ కవిత్వాన్ని అనువదించాడు. ఈ పద్యసంపుటి పేరు ‘భానుసింహ’. చాలా రచనలను ‘భానుసింహ ఠాగూర్’ అనే కలం పేరుతో రచించారు. బెంగాలీ భాషతోపాటు సంస్కృతాంగ్ల భాషల్లోనూ పట్టు సాధించాడు.
బారిస్టర్ చదువుకు స్వస్తి
దేవేంద్రనాథ్‌కి కొడుకుని బారిస్టర్‌గా చూడాలని కోరిక. 1878లో ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్‌కు పంపారు. కానీ, తండ్రికి తెలియకుండా బారిస్టర్ పూర్తి చేయకుండానే చదువు మానేసి షేక్‌స్పియర్ రచనలకు ప్రభావితుడైనాడు. ఎంతో శ్రద్ధతో చదువుతూ బహుముఖ కార్యకలాపాలలో నిమగ్నుడయ్యేవాడు. కళా పరి షత్తు గ్రంథాలయానికి నియమం తప్పకుండా వెళ్లి వివి ధ పుస్తకాలను చదువుతూ సారస్వత చర్చలలో పాల్గొనేవాడు. ఆంగ్ల సాహిత్యంతోపాటు ఫ్రెంచ్, జర్మన్ సాహి త్యాన్ని కూడా పరిచయం చేసుకునేవాడు. ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చాక రవీంద్రునికి సంగీతం పట్ల ఎక్కువ మక్కువ కలిగింది. అప్పుడు అనేక గీతాలు రచించాడు. ‘ఉదయ గీతికలు’, ‘సాంధ్య గీతికలు’ వంటి శీర్షికలతో ప్రత్యేక సంపుటాలుగా ప్రచురించి భావయుక్తంగా గానం చేసేవారు.
‘గీతాంజలి’తో విశ్వగురు స్థానం
‘గీతాంజలి’ పేరున గొప్ప కావ్యాన్ని బెంగాలీ భాషలో రచించి, ఆంగ్లభాషలోకి అనువదించారు. ఫలితంగా విశ్వకవి బిరుదుసహా (1913లో) నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడుగా ప్రపంచ ప్రఖ్యాతిని పొందారు. ‘గీతాంజలి’ మహత్తర మానవీయ కావ్యం. అనేక భాషల్లోకి ఇది అనువాదమైంది. మతాలకు అతీతంగా ఆలోచించి విశ్వంలోని మానవులంతా ఒకటేననే భావనతో వీరు ‘గురుదేవుడు’ అనిపించుకున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రానంతరం ‘జనగణమన’ జాతీయ గీతాన్ని రచించారు. అప్పటికే బంకింగ్‌చంద్ర ఛటర్జీ ‘వందేమాతరం’ జాతీయగీతంగా ప్రకటితమైంది. రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్, ‘ఈ రెండు అద్భుత గీతాలు సమాన ప్రతిపత్తిని కలిగి ఉన్నాయని’ రెంటినీ జాతీయ గీతాలుగా ప్రకటించారు.
వ్యాసకర్త సెల్: 99081 10937
‘శాంతి నికేతన్’ కోసం సర్వస్వం
రవీంద్రుడు తన గ్రామసంచార అనుభవాలన్నింటినీ లేఖలద్వారా, కథలద్వారా ప్రచురించి జాతీయ జీవనానికి శాశ్వతత్వాన్ని కల్పించారు. వీరికి 1883లో మృణాళిని దేవితో వివాహం జరిగింది. కొద్దికాలం జమీందారు ఎస్టేట్స్ చూసుకున్న తర్వాత శాంతినికేతన్‌కి మకాం మార్చారు. శాంతి నికేతన్ స్థాపన, నిర్వహణ రవీంద్రునికి సంతృప్తిని కలిగించింది. కానీ, దాని కొనసాగింపు ఆర్థికంగా కష్టతరమైంది.
కారణం అక్కడ ఉచితవిద్యను అం దించడమే. దీనిని కొనసాగించడానికి ధనవంతులను వీరు యాచించవలసి వచ్చింది. ఆయన అర్థాంగి తన నగలన్నీ భర్తకు ఇచ్చేసింది. కానీ, విధి వక్రించి ఆమె స్వర్గస్తురాలైంది. సర్వస్వం కోల్పోయిన వానివలె రవీంద్రుడు కుప్పకూలిపోయాడు. మహాకవులు తమ దుఃఖాన్ని రసమయ కావ్యరూపంలో రచించి ఆనందిస్తారు. వీరు ‘సంస్మరణ’పేర్న మరో కావ్యం రాసి ఉపశమనం పొందారు.
వేముగంటి శుక్తిమతి






