28 June, 2026 | 4:50 PM

గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

28-06-2026 03:39 PM

మూడు కార్లు, బైక్ ఢీ – నలుగురికి తీవ్ర గాయాలు

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారి 65 పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మూడు కార్లు, ఒక బైకు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ముందువెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న వాహనాలు నియంత్రణ కోల్పోయి వరుసగా ఢీకొన్నట్లు ప్రాథమిక సమాచారం.

ప్రమాద సమయంలో మూడు కార్లలో ప్రయాణిస్తున్న మొత్తం పది మందిలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదంతో కార్లు రహదారిపై అడ్డంగా నిలిచిపోవడంతో జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయి పలుకిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, గాయపడిన వారి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.