హోటళ్లు, లాడ్జీల యాజమాన్యాలు అలర్ట్‌గా ఉండాలి
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం, మే 19 (విజయక్రాంతి): హోటళ్లు, లాడ్జీల యాజమాన్యాలు అలర్ట్ గా ఉండాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సూచించారు. కరీంనగర్ నగరంలో ఇటీవల పీఎంజే జ్యువెలరీలో జరిగిన భారీ దోపిడీని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు, లాడ్జీల యజమానులు, నిర్వాహకులతో క రీంనగర్ కమీషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ హాలునందు పోలీస్ కమీషనర్ ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ఆయుధాలతో కూడిన ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠా నకిలీ ఆధార్ కార్డులు, తప్పుడు ఫోన్ నంబ ర్లు, తప్పుడు చిరునామాలు ఇచ్చి నగరంలోని పలు హోటళ్లలో దాదాపు రెండు నెల ల పాటు బస చేసి, నిఘా (రెక్కి) నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతే ధ్యేయంగా పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా కఠినమైన మార్గదర్శకాలను జారీ చేస్తున్నామని తెలిపారు.
హోటల్ లేదా లాడ్జీలలో రూములు కేటాయించే ముందు ప్రభుత్వ గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కేవలం ఆధార్ కార్డులను గుడ్డిగా నమ్మకుండా.. అందులోని ఫోటో, వయస్సు, చిరునామా అసలైనవా కాదా అ ని సరిచూసుకోవాలన్నారు. అవసరమైతే అదనపు గుర్తింపు కార్డులను అడగాలన్నారు. కస్టమర్లు ఇచ్చే మొబైల్ నంబర్ పనిచేస్తుందో లేదో క్రాస్-చెక్ చేసుకోవాలని, అది సదరు వ్యక్తి పేరు మీద ఉందో లేదో నిర్ధారించుకోవాలన్నారు.
విదేశీయులు వస్తే నిబంధనల ప్రకారం తక్షణమే సమాచారం అందించాలన్నారు. ప్రతి హోటల్లో హై-రెజల్యూషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, కనీసం 90 రోజుల ఫుటేజీని భద్రపరచాలని, గెస్ట్ రిజిస్టర్, ఐడీ ప్రూఫ్స్, వాహనాల వివరాలు, చెక్-ఇన్/చెక్-అవుట్ సమయాలను డిజిటల్ రూపంలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. లగేజీ లేకుండా రూమ్ తీసుకునేవారు, ఆయుధాలు లేదా అనుమానాస్పద బ్యాగులతో వచ్చేవారు, సీసీ కెమెరాల ముందుకు రాకుండా తప్పించుకునే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.
భారీ నగదు లావాదేవీలు చేసే వారి వివరాలను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు చేరవేయాలని, నిబంధనలు ఉల్లంఘించి, నిందితులకు ఆశ్రయం కల్పించినా లేదా పోలీసుల తనిఖీలకు సహకరించకపోయినా సదరు హోటల్ యాజమాన్యాలపై క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రాంచందర్ రావు, సృజన్ రెడ్డి, తిరుమల్, స్థానిక హోటల్స్, పాల్గొన్నారు.






