నాగిరెడ్డిపేట్లో సరికొత్త రికార్డు
-ఒకే రోజు సుమారు 60 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తూ,ఒకే రోజు నాగిరెడ్డిపేట్ మండల వ్యాప్తంగా సుమారు 60కుపైగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండలంలో ఆయా గ్రామాల సర్పంచులు ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. “నాగిరెడ్డిపేట్ మండలంలో చరిత్రలో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు పేదల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వందలాది కుటుంబాలు కొత్త ఇంట్లో అడుగుపెడుతున్నాయి.
ఒకే రోజు 60కు పైగా గృహప్రవేశాలు జరగడం నియోజకవర్గానికి గర్వకారణం” అని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన జీవితం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట్ మండలంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి అందేలా నిరంతరం కృషి కొనసాగిస్తామని తెలిపారు.
కొత్త ఇంట్లో అడుగుపెట్టిన లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, జీవితకాల కలను నిజం చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తున్న నాయకుడిగా ఎమ్మెల్యే గుర్తింపు పొందుతున్నారని వారు పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట్ మండలానికి 365 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 90 ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యాయని, సోమవారం ఒక్కరోజే 60 ఇండ్లు గృహప్రవేశాలు ప్రారంభించడం జరిగిందని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.






