ప్రపంచ ప్రజల వ్యతిరేకి డోనాల్డ్ ట్రంప్.. దేశ ప్రజల వ్యతిరేకి నరేంద్ర మోడీ
- పోటు రంగారావు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి
ఇల్లెందు,(విజయక్రాంతి): ప్రపంచ దేశాలపై దురాక్రమణ యుద్ధాలకు పాల్పడుతున్న నరహంతక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశ ప్రజల వ్యతిరేకి అయితే పాసిస్ట్ విధానాలను అమలు చేస్తూ అవినీతి, హంతక పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ భారత ప్రజల వ్యతిరేకంగా ఉన్నారని సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా (మాస్ లైన్) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. సోమవారం ఇల్లందు పట్టణం చంద్రా కృష్ణమూర్తి ట్రస్ట్ భవన్ లో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్ కర్తవ్యాలు, ఉద్యమ, నిర్మాణ సమీక్ష సమావేశం ఇల్లందు మండల నాయకులు శ్రీరామ్ కోటయ్య అధ్యక్షతన జరిగింది.
సభ ప్రారంభానికి ముందు జెండా ఆవిష్కరణ పూనెం కుమార్ చేశారు. అమరవీరుల సంతాప తీర్మానాన్ని ఇల్లందు మండల నాయకులు బండారి సత్యం ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య వక్తులుగా హాజరైన పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, సిపిఎంఎల్ ప్రజాపంథా కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ముద్ద బిక్షం, జిల్లా సహాయ కార్యదర్శి నాయిని రాజు హాజరై మాట్లాడుతూ ప్రపంచంలో అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకోవడం కోసం ఆయిల్ సంపదలు అధికంగా కలిగి ఉన్న ఇరాన్, ఇరాక్,లేబనాన్ దేశాలపై యుద్ధం ప్రకటించి అమాయక ప్రజలను చంపివేయడమే కాకుండా ఇరాన్ అధ్యక్షున్ని నిర్ధాక్షణంగా చంపి వేసిందని అన్నారు.
ఇరాన్ ధైర్యంతో ఎంతమంది ప్రాణాలు పోయినా ఇరాన్ దేశ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు అమెరికాను ప్రతిఘటించటంతో అమెరికా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొందని అన్నారు. ఒక్క అమెరికా మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలపై ఆర్థిక సంక్షోభం ఏర్పడి నిత్యవసర సరుకుల ధరలు, గ్యాస్, పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగి ప్రపంచ దేశాల ప్రజలపై పెను భారం మోపబడిందని అన్నారు. ప్రపంచ దేశాలలో యుద్ధాలు సృష్టి ఆయుధాలు అమ్ముకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న అమెరికా నేడు ఆర్థిక సంక్షోభం ఏర్పడి కొట్టుమిట్టాడుతుందని అన్నారు.
ప్రపంచ దేశాల దురాక్రమణ యుద్ధాల కారణంగా అమెరికా ప్రపంచ ప్రజల వ్యతిరేకగా మారిందని పేర్కొన్నారు. నేడు దేశంలో మోడీ సైతం ట్రంపు అడుగుజాడల్లోనే ప్రయాణిస్తూ ఆదాని అంబానీలను ప్రపంచ దేశాల పర్యటనలో తిప్పుతూ ఇది దేశ ప్రజల కోసమే అంటూ ఊదరగొడుతున్నాడని అన్నారు. మోడీ అధికారంలోకి రాకముందు ప్రపంచ దేశాల సంపన్నులలో 9 వ స్థానంలో ఉన్న ఆదాని నేడు రెండో స్థానంలోకి వచ్చే అంత సంపద వారికి ఎలా పెరిగిందని ప్రశ్నించారు. నేడు దేశంలో నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ల లీకేజీని ప్రోత్సహించి మోడీ ప్రభుత్వం లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిందని అన్నారు. మోడీ ప్రభుత్వం అవినీతి పరులకు, గ్యాంగ్ రేపిస్టులకు అండగా ఉంటూ కుల, మత విభేదాలను సృష్టించి దేశంలో అల్లకల్లోలాలకు కారణమవుతుందని అన్నారు. దేశంలో బిజెపి పాసిధానికి వ్యతిరేకంగా బలమైన ప్రజాస్వామ్య ఉద్యమాలను నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.






