ఎంత ధైర్యం?
- విద్యార్థులకు వర్సిటీల హెచ్చరికలపై రాహుల్
- నిరసనల్లో పాల్గొనవద్దన్న డీయూ, జేఎన్‌యూ, ఐఐటీ రూర్కీ, మద్రాస్ ఐఐటీ
న్యూఢిల్లీ, జూలై 24: ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న సీజేపీ నిరసనల్లో పాల్గొనొద్దని శుక్రవారం విద్యార్థులను హెచ్చరించిన పలు యూనివర్సిటీలపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆగ్రహించారు. ‘మీకెంత ధైర్యం’ ఉంటే విద్యార్థులను బెదరిస్తారని మండిపడ్డారు. యూనివర్సిటీల నిర్ణయం విద్యార్థుల హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేశారు. జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరపలేదంటూ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు.
ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకుంటు న్నందుకు వారిని విశ్వవిద్యాలయాలు భయపెడుతున్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్’లో డీయూ పోస్ట్‌ను షేర్ చేసిన రాహుల్ గాంధీ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ) ఆదేశాలు.. విద్యార్థుల హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేశా రు. దేశంలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించకూడదా? వారు నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనొద్దనడానికి ‘మీకెంత ధైర్యం’ అంటూ ఫైర్ అయ్యారు.
సమయం వచ్చినప్పుడు ఇలాంటి చర్యలకు ఆయా విశ్వవిద్యాలయాలు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుం దని తెలుసుకోవాలని రాహుల్‌గాంధీ సూచించారు. అంతకుముందు సీజేపీ నిరసనల్లో పాల్గొనొద్దని ఢిల్లీ విశ్వవిద్యాల యం(డీయూ), జేఎన్‌యూ, ఐఐటీ రూర్కీ, ఐఐటీ మద్రాస్ ఆదేశాలు జారీచేశాయి. విద్యార్థుల భద్రతకు, విద్యా పురోగతి, వృత్తి అవకాశాలపై ప్రభావం చూపవచ్చని పేర్కొన్నాయి. ఇలాంటి నిరసనలకు విద్యార్థులు దూరంగా ఉండాలని హెచ్చరించాయి.
నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం చట్టవ్యతి రేకతకు కూడా దారితీస్తుందని డీయూ తెలిపింది. అదే సమయంలో సోషల్ మీడియా లో తప్పుదోవ పట్టించే, నకిలీ వార్తల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్యాసంస్థల భాగస్వా ములందరూ బాధ్యతాయుతంగా మెలగాలని, తమ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయా యూనివర్సిటీలు కోరాయి. విద్యాపరమైన బాధ్యతాయుతమైన విలువలను పాటించాలని తెలిపింది.
పెల్లెట్ గన్ గాయాలైన విద్యార్థితో..
విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరపలేదంటూ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. పెల్లెట్ తగిలి గాయపడిన సాహిల్ అనే విద్యార్థితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థికి అయిన గాయాలను ప్రదర్శించారు. పెల్లెట్ గన్ పేల్చడం వల్లే విద్యార్థి గాయపడ్డాడని వైద్యులు కూడా చెబుతున్నారని, కన్ను, మోచేయి, ఇతర శరీర భాగాలకు గాయాల య్యాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు.
ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థికి ప్రస్తుతం కన్ను వద్ద గాయం కావడంతో కనిపించడం లేదని, భవిష్యత్‌లో చూపు వస్తుందో? రాదో? కూడా చెప్పలేమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్‌పై కేంద్ర ప్రభుత్వం కాల్పులు జరిపిందని మండిపడ్డారు. వెంటనే బాధితులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని, ప్రశ్నాపత్రాల లీక్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.






