2 September, 2026 | 5:26 PM

రాకపోకలు సాగేదెట్ల?

01-09-2025 | 12:24am

-కోట్ల రూపాయలతో రోడ్లు 

-దెబ్బతిన్న చోట మరమ్మతులు లేక ఇబ్బందులు

మహబూబాబాద్, ఆగస్టు 31 (విజయ క్రాంతి): లక్షల రూపాయలు వెచ్చించి రోడ్లు వేసినప్పటికీ, దెబ్బతిన్న చోట మరమ్మతులు చేపట్టకపోవడంతో కాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మహబూబాబాద్ జిల్లాలో వివిధ మారుమూల ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం కోసం వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు నిర్మించారు. అయితే ఏడాది క్రితం భారీ వర్షాలతో పలుచోట్ల రోడ్లకు గండ్లు పడి దెబ్బ తిన్నాయి. తాత్కాలికంగా మట్టి పోసి రాకపోకలు పునరుద్ధరించినప్పటికీ పూర్తిస్థాయి మరమ్మతులు నిర్వహించలేదు. దీనితో ఈ వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్ల వద్ద బురద మయమై వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. 

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, మారుమూల గిరిజన సంక్షేమ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పలు రోడ్లు దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా అనేకచోట్ల ఇదే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికాలంగా శాశ్వత ప్రతిపాదికన మరమతు పనులు చేపట్టకపోవడం వల్ల ఈ వర్షాకాలంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు నిర్వహించాలని ప్రజాప్రతి నిధులు, అధికారులకు విజ్ఞప్తి చేయగా, పనుల నిర్వహణ కోసం ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదని సమాధానం చెబుతూ సమస్యకు పరిష్కారం చూపకుండా దాటవేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొందని ప్రజలు చెబుతున్నారు. ఏదైనా మారుమూల ప్రాంతానికి బయలు దేరితే మొదట్లో రోడ్డు ఎంతో బాగుంటుందని, తీరా మార్గ మధ్యలో రోడ్డు దెబ్బతిని కనిపిస్తుండడంతో వెనక్కి పోలేక ముందుకు వెళ్లలేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు విమర్శిస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే దెబ్బతిన్న రోడ్లపై రాకపోకలు సాగించడం కష్టంగా మారిందని పేర్కొంటున్నారు. 

అధికారులు స్పందించి దెబ్బతిన్న రోడ్లకు, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లకు వెంటనే శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు తొలగిం చాలని కోరుతున్నారు.