16 March, 2026 | 3:41 AM

సాగునీటికి నిధి ఎంతో!?

16-03-2026 12:50 AM
  1. ప్రాజెక్టుల భవిష్యత్ అంతా.. బడ్జెట్‌పైనే
  2. నిధుల్లేక ముందుకు కదలని నిర్మాణ పనులు
  3. ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ప్రభుత్వం కసరత్తు
  4. కీలక ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యం
  5. ఈ బడ్జెట్‌లో నిధులు విడుదల చేసే దిశగా చర్యలు

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తు ఈసారి బడ్జెట్ పైనే ఆధారపడింది. నిధుల కొరతతో నెలలుగా ముందుకు కదలని అనేక నిర్మాణాలు ఉన్న నేపథ్యంలో, రాబోయే బడ్జెట్‌లో ప్రాధాన్యత ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే దిశగా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి  సారించింది. ముఖ్యంగా సాగునీటి రంగాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రంలో పలువురు రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే ప్రారంభమైన కానీ నిధుల లేమితో నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రభుత్వానికి కీలక లక్ష్యంగా మారింది. దీంతో ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులను గుర్తించి వాటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సాగునీటి శాఖ కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా ఎక్కువ ఎకరాలకు నీరు అందించే సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.

ఇప్పటికే ఉన్నతాధికారులు కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికల ఆధారంగా బడ్జెట్‌లో అవసరమైన నిధులు కేటాయించే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పలు పెద్ద, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులు 70 నుంచి 80 శాతం పనులు పూర్తయినప్పటికీ, నిధుల కొరత కారణంగా చివరి దశలో నిలిచిపోయాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ముందు గా పూర్తికి చేరువలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదిలా ఉండగా, సాగునీటి ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించాలని రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైతులకు స్థిరమైన నీటి వనరులు అందించాలంటే ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. ఈ నేప థ్యంలో రాబోయే బడ్జెట్‌లో సాగునీటి ప్రా జెక్టులకు ఎంత మేరకు నిధులు కేటాయిస్తారన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాజెక్టులకు పెద్ద ఎ త్తున నిధులు విడుదల చేస్తే, నిలిచిపోయిన నిర్మాణాలకు మళ్లీ ఊపు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

పలు ప్రాజెక్టులు.. వాటికి అవసరమైన నిధులు

రాష్ట్రంలో ముఖ్యమైన ఎత్తిపోతల పథకాలలో ఒకటైన కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఇంకా అనేక పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, డిస్ట్రిబ్యూటరీలు, ఫీడర్ ఛానళ్ల నిర్మాణం పూర్తికాకపోవడంతో పూర్తి ఆయకట్టుకు నీరందడం లేదు. ప్రస్తుతం ఉన్న డిజైన్ ప్రకారం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే మరో రూ.377 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.

అలాగే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో ఇప్పటివరకు రూ.2,503 కోట్లు ఖర్చు చేసినప్పటికీ పూర్తి చేయడానికి ఇంకా రూ.231.36 కోట్లు అవసరమవుతాయని అంచనాలు ఉన్నాయి. గత ఏడాది బడ్జెట్లో రూ.105 కోట్లు కేటాయించినా అవి కేవలం రివైజ్డ్ అంచనాలకు మాత్రమే సరిపోవడంతో ప్రాజెక్టు పురోగతి పెద్దగా కనిపిం చలేదు. మరోవైపు ర్యాలంపాడు రిజర్వాయర్‌లో లీకేజీలు ఉండటం వల్ల పూర్తి ఆయకట్టుకు నీరు అందించలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యల పరిష్కా రానికి రూ.142 కోట్ల ప్రతిపాదనలు ప్ర భుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

ఇక భీమా ఎత్తిపోతల పథకంను రెండు దశలుగా చేపట్టారు. భీమా ద్వారా 1.11 లక్షల ఎకరాలకు, భీమా ద్వారా 2.03 లక్షల ఎకరా లకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ప్రారంభ అంచ నా రూ.2,158 కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ప్రస్తుతం మరో రూ.350 కోట్లు అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కోయిల్ సాగర్ పరిధిలో ఆయకట్టు విస్తరణ కోసం సుమా రు రూ.100 కోట్ల అవసరం ఉందని అంచ నా వేస్తున్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.

ప్రారంభంలో రూ.900 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజె క్టు అంచనా ప్రస్తుతం రూ.1,197.70 కోట్లకు పెరిగింది. ఇప్పటివరకు రూ.629.26 కోట్లు ఖర్చు కాగా, మిగిలిన పనులు పూర్తి చేయడానికి మరో రూ.558.34 కోట్లు అవసరం. ఇదే సమయంలో కీలకమైన వల్లూరు, జూలకల్, మల్లంపల్లి రిజర్వాయర్ల నిర్మాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉండటంతో వాటి ఖర్చు ప్రస్తుత ధరల ప్రకారం రూ.1,500 కోట్లకు పైగా చేరే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

గట్టు ఎత్తిపోతల పథకంకు రూ.581 కోట్లు అంచనా ఉండగా ఇప్పటివరకు రూ.204.96 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన పనులు పూర్తి చేయడానికి మరో రూ.362 కోట్లు అవసరమని అంచనా. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులు చివరి దశలో నిలిచిపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. 

నిధులు కేటాయిస్తేనే పనుల్లో వేగం... 

రాష్ట్రంలో అత్యంత భారీ ప్రాజెక్టుగా భావిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం పరిస్థితి కూడా ఇంకా అనిశ్చితిలోనే ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.55,086 కోట్లు అవసరం. అయితే ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందలేదు. నిర్మాణ ఖర్చులు పెరిగితే ఈ అంచనా రూ.80 వేల కోట్ల వరకు చేరే అవకాశముందని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు.

గత బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.1,285 కోట్లు కేటాయించినప్పటికీ పనులు చాలా నెమ్మదిగా కొనసాగుతున్నాయి. సీఎం సొంత నియోజకవర్గానికి చెందిన నారాయణపేట ఎత్తిపోతల పథకంకు 2024 ఫిబ్రవరి 21న సీఎం శంకుస్థాపన చేశారు. మొదటి దశ టెండర్లు పూర్తయినా ప్రాజెక్టు ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ప్రకటించిన ఈ పథకం వేగంగా సాగాలంటే ఈసారి బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. మరో ముఖ్యమైన ప్రాజెక్టు దేవాదుల ఎత్తిపోతల పథకం కూడా బడ్జెట్ చర్చల్లో ప్రధానంగా నిలుస్తోంది.

గోదావరి జలాలను ఎత్తున ప్రాంతాలకు తరలించి వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో సుమారు 6.21 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. సాంకేతికంగా క్లిష్టమైన ఈ పథకంలో భారీ పంప్ హౌసులు, పైప్లైన్లు, కాల్వల నిర్మాణం వంటి పనులు భాగంగా ఉన్నాయి. ప్రారంభంలో రూ.6,016 కోట్లతో ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం దాదాపు మూడు రెట్లు పెరిగి రూ.18,500 కోట్లకు చేరింది.

ఇప్పటివరకు రూ.14,188 కోట్లు ఖర్చు చేసి సుమారు 91 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 9 శాతం పనులు పూర్తి చేయడానికి మరో రూ.4,312 కోట్లు అవసరమని ఇరిగేషన్ శాఖ అంచనా వేస్తోంది. భూసేకరణ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు, కాంట్రాక్టు మార్పులు, నిధుల కొరత వంటి కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమవుతోంది.

ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. భూసేకరణకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతుల్లో ఆశలు పెరిగాయి. పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులన్నింటి భవిష్యత్ ఇప్పుడు బడ్జెట్ పైనే ఆధారపడింది.

కీలక ప్రాజెక్టులకు భారీ నిధులు కేటాయిస్తే నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉంది. లేకపోతే పరిమిత కేటాయింపులతో ప్రాజెక్టుల పూర్తి మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైతులు కూడా ఈసారి బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.