4 May, 2026 | 3:24 AM

తుమ్మిడిహట్టి పరిష్కారం ఎలా?

04-05-2026 01:55 AM

150 మీటర్ల ఎత్తులో బరాజ్‌కు తెలంగాణ ప్రతిపాదనలు

  1. గతంలో 152 మీటర్ల ఎత్తుపై మహారాష్ట్ర అభ్యంతరం 
  2. మరోసారి తెరపైకి అంతర్రాష్ట్ర జలవివాదం
  3. ఇక్కడ కాంగ్రెస్, అక్కడ బీజేపీ.. అంగీకరించేనా?
  4. వ్యూహాత్మకంగా కిషన్‌రెడ్డిని రంగంలోకి దింపిన ప్రభుత్వం
  5. కేంద్ర ప్రభుత్వ జోక్యంతోనే గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. అయితే ప్రభు త్వ నిర్ణయంతో మళ్లీ తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నీళ్ల రాజకీయం తెరపైకి రానున్నది. ప్రాజెక్ట్ ఎత్తు, నీటి వినియోగం, ముంపు ప్రభావం వంటి సాంకేతిక అంశాలు ప్రస్తుతం కీలకంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం 150 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.

ఈ ఎత్తుతో సుమారు 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉండటంతో, ప్రాజెక్ట్‌కు ఆర్థిక, వ్యవసాయ పరంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇప్పటికే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ కింద వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, కాల్వల నిర్మాణం కొంతవరకు పూర్తవడం వంటి అంశాలు కూడా ఈ నిర్ణయానికి బలం చేకూరుస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచడం ద్వారా మహారాష్ట్రలో ముంపు ప్రభావమే సమస్య గా మారుతుంది.

148 మీటర్ల ఎత్తుకు అంగీకరించిన మహారాష్ట్ర, 152 మీటర్ల ఎత్తుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో 150 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని మధ్యేమార్గంగా ప్రతిపాదిస్తున్నటికీ తెలంగాణ ప్రతిపాదనలపై మహారాష్ట్ర అంగీకరించడంపై సందేహా లు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ కాంగ్రె స్ ప్రభుత్వం, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉండటంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం రాజకీయ అంశంగా మారిం ది.

తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని మధ్యవర్తిగా ఉపయోగించుకోవాలని చూస్తుండగా, మహారాష్ట్ర స్పందనపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని రంగంలోకి దింపడంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తున్నది. కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం జరుగుతోంది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్రను ఒప్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతమేర సఫలమవుతుందనేది ఆసక్తికరంగా మారింది. 

మహారాష్ట్ర అంగీకరించేనా?

తుమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు పెంచడంలో మహారాష్ట్రలో ముంపు ఎంత ఉంటుంది? దానికి ఎంత పరిహారం చెల్లించాలి? వంటి అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. ప్రాణహిత నదిపై ప్రతిపాదిత తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణం పూర్తిగా బరాజ్ ఎత్తు, తుది డిజైన్ రెండు రాష్ట్రాల సంయుక్త సర్వేలపై ఆధారపడి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబా టులో ఉన్న సాంకేతిక అంచనాల ప్రకారం ముంపు ప్రభావం ఎత్తును బట్టి మారుతుందని స్పష్టం చేస్తున్నారు.

148 మీటర్ల ఎత్తు వద్ద మహారాష్ట్రలో ముంపు ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని, కొన్ని గ్రామాల పరిధిలో మాత్రమే నీరు చేరే అవకాశం ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభు త్వం ప్రతిపాదిస్తున్న 150 మీటర్ల ఎత్తు వద్ద పరిమిత స్థాయిలో ముంపు ఉండొచ్చని, ముఖ్యంగా గడ్చిరోలి జిల్లాలోని అడవి, తక్కువ జనాభా గల ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. నివాస గ్రామాలపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి.

ఇక 152 మీటర్ల ఎత్తు వద్ద పరిస్థితి మారే అవకాశం ఉంది. ఈ స్థాయిలో ముం పు విస్తృతి పెరిగి, గ్రామాలు, వ్యవసాయ భూములు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున మహారాష్ట్ర గతంలోనే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో 150 మీటర్ల ఎత్తు నిర్వహించగల ముంపుగా టెక్నికల్ టీమ్స్ భావిస్తున్నప్పటికీ, దీనిపై తుదినిర్ణయం ఇంకా రాలేదు. ముంపు ప్రభావంతో పాటు పరిహారం అంశం కూడా కీలకంగా మారింది.

భూములు, ఇళ్లు, పంటలు, పునరావాసం, అడవి భూముల క్లియరెన్స్ ఖర్చులు కలిపి పరిహారం ప్యాకేజీ రూపుదిద్దుకోనుంది. ఇతర ప్రాజెక్ట్‌లను బట్టి చూస్తే ఈ మొత్తం కొన్ని వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఫైనల్ డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, సంయుక్త సర్వేల తర్వాతే కచ్చితమైన అంచనా వెలువడనుంది.

అయితే మహారాష్ట్ర అంగీకారం లేకుండా ప్రాజెక్ట్ ముందు కు సాగడం సాధ్యం కాదు. పర్యావరణ అనుమతులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలు కూడా తప్పనిసరి కావడంతో ఈ ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారింది. 150 మీటర్ల ఎత్తు వద్ద ముంపు తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, అసలు సవాలు మహారాష్ట్ర అంగీకారమేనని విశ్లేషకులు చెబుతున్నారు. 

ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయం..

తుమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు విషయంలో మహారాష్ట్ర అంగీకారం లభించకపోతే తెలంగాణ ప్రభుత్వం ముందున్న మార్గాలపై స్పష్టత అవసరమనే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితిలో మొదటగా తెలంగాణ ప్రభుత్వం చర్చల ద్వారానే సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా బరాజ్ ఎత్తు విషయంలో మార్పులు చేయ డం, లేదా అధిక పరిహారం ప్యాకేజీ ఆఫర్ చేయడం వంటి అంశాలను ముందుకు వచ్చే అవకాశముంది.

కేంద్రం మధ్యవర్తిత్వం కూడా కీలకంగా మారే సూచనలు ఉన్నాయి. అయితే చర్చలు విఫలమైతే, ఈ అంశం చట్టపరమైన దిశగా వెళ్లే అవకాశం కూడా ఉంది. అంతర్రాష్ట్ర జల వివాదంగా తీసుకుని ట్రైబ్యునల్ లేదా కోర్టుల ముందు పెట్టే పరిస్థితి రావచ్చు. అయితే ఈ ప్రక్రియ దీర్ఘకా లం పట్టే అవకాశం ఉండటంతో ప్రాజెక్ట్ అమలు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు, ప్రాజెక్ట్ డిజైన్‌లో మార్పులు చేయడం కూడా ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.

బరాజ్ ఎత్తును 150 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకుంటే మహారాష్ట్ర అంగీకారం పొందే అవకాశం ఉన్నప్పటికీ, దీనివల్ల తెలంగాణకు లభించే నీటి పరిమాణం తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా తుమ్మిడిహట్టి బరాజ్‌జ్ నిర్మాణం పూర్తి గా మహారాష్ట్రతో జరిగే చర్చలు, కేంద్రం మధ్యవర్తిత్వం, అలాగే తెలంగాణ ప్రభుత్వం తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ఒప్పందం కుదిరితే ప్రాజెక్ట్ వేగంగా ముందు కు సాగే అవకాశం ఉండగా, విభేదాలు కొనసాగితే ఆలస్యమయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేంద్రం జోక్యంతోనే కొలిక్కి వచ్చే అవకాశం..

తుమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు వివాదం మరింత సంక్లిష్టంగా మారుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వ జోక్యంతోనే పరిష్కారం లభించే అవకాశం ఉన్నదనే అభిప్రాయం బలపడుతోంది. ఇలాంటి అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్‌లో సాంకేతిక అంశాల కంటే రాజకీయ సమన్వయం కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం మధ్యవర్తిత్వం లేకుండా తుది ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని సంప్ర దించే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యం గా కేంద్ర జలవనరుల శాఖ, సంబంధిత అధికార యంత్రాంగం ద్వారా జాయింట్ సర్వేలు నిర్వహించడం, ముంపు ప్రభావాన్ని సాంకేతికంగా అంచనా వేయడం వంటి చర్యలు కీలకంగా మారనున్నాయి. ఈ ప్రక్రి య ద్వారా రెండు రాష్ట్రాల అభ్యంతరాలను తగ్గించే ప్రయత్నం జరగనుంది. దీంతోపాటు పర్యావరణ, సాంకేతిక అనుమతుల ప్రక్రియలో కూడా కీలకంగా ఉంటుంది.

కేంద్ర అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ ముం దుకు సాగడం సాధ్యం కాకపోవడంతో తుది నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ప్రాధాన్యం సంతరించుకున్నది. రాజకీయం గా కూడా ఈ అంశం సున్నితంగా మారింది. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు రాజకీయ సమీకరణాలు ఉండటంతో, కేంద్రం సమతౌల్యం పాటిస్తూ ఒక రాజీ కుదర్చాల్సిన పరిస్థితి ఉంది.

ఒకవైపు తెలంగాణకు నీటి అవసరాలు, మరోవైపు మహారాష్ట్రలో ముంపు ఆందోళనలను సమన్వయం చేయ డం కేంద్రానికి పెద్ద సవాలుగా మారనున్నది. కేంద్రం ముందుకు వచ్చి, స్పష్టమైన మార్గదర్శకాలు, సాంకేతిక నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటేనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.