24-02-2026 12:13:27 AM
చండీగడ్, ఫిబ్రవరి ౨౩: హర్యానా ప్రభుత్వ బ్యాంక్ ఖాతాల నుంచి రూ. 590 కోట్లు మాయమైన ఉదంతం ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. చండీగడ్‌లోని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ శాఖ పరిధిలో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఒక ప్రభుత్వ శాఖ తమ ఖాతాను మూసివేసి నిధులను మరో బ్యాంకుకు బదిలీ చేయాలని కోరగా, బ్యాం కర్లు ఆ పని పూర్తి చేశారు.
కానీ, ఖాతాల్లో అంతకుముందున్న నగదుకు, బదిలీ చేసిన తర్వాత ఉన్న నగదుకు రూ.౫౯౦ కోట్ల వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. ఈ వ్యత్యాసాన్ని గుర్తించిన అధికారులు వెంటనే బ్యాంకు యాజమాన్యాన్ని నిలదీశారు. ప్రాథమిక విచారణలో కొందరు బ్యాంకు ఉద్యోగులు బయటి వ్యక్తులతో కలిసి ఈ స్కాంకు పాల్పడినట్లు తేలింది.
నిందితులు ఫోర్జరీ చెక్కుల ద్వారా నిధులను ఇతర వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు అవినీతి నిరోధక శాఖ ప్రాథమికంగా గుర్తించింది. కుంభకోణంపై ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ సోమవారం అసెంబ్లీ వేదికగా స్పందించారు. స్కాంలో దారి మళ్లిన ప్రతి రూపాయిని వెనక్కి తెస్తామని హామీ ఇచ్చారు. మోసానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా, అదుపులోకి తీసుకుంటామని వారి కఠినంగా శిక్షిస్తామని ప్రతినబూనారు.