25 June, 2026 | 1:46 AM

అనాథల కోసం భారీ విరాళం

25-06-2026 12:42 AM
  1. విద్యార్థుల చదువు కోసం అబ్దుల్ ముఖీత్ చందా 50 లక్షల సహాయం
  2. తన కొడుకు పెళ్లి ఖర్చుల మళ్లింపు
  3. అభినందించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): తన పెద్ద కుమారుడి వివాహ వేడుకల్లో అనవసర ఖర్చులను తగ్గించుకుని, ఆ మొత్తాన్ని అనాథ, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువు కోసం రూ.50 లక్షల విరాళంగా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు అబ్దుల్ ముఖీత్ చందా అందించారు. ఆయనను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. పెళ్లిళ్లలో జరిగే విపరీతమైన అలంకరణలు, ఇతర అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని, ఆ డబ్బును ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం వెచ్చించాలని అబ్దుల్ ముఖీత్ చందా, ఆయన కుటుంబం నిర్ణయించుకున్నారు.

సర్ సయ్యద్ సొసైటీ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న అనాథ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థుల ఒక విద్యా సంవత్సరపు ట్యూషన్ ఫీజును చెల్లించడం ద్వారా, వారు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చదువు కొనసాగేలా చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. ఈ కార్యక్రమానికి మద్దతుగా, సర్ సయ్యద్ సొసైటీ విజ్ఞప్తి మేరకు పలు విద్యాసంస్థలు ట్యూషన్ ఫీజులో 50 శాతం రాయితీని ప్రకటించాయి.

ఈ ఉమ్మడి కృషి వల్ల మరిన్ని ఎక్కువ మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, వ్యక్తిగత వేడుకను విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప అవకాశంగా మలుచుకోవడం ద్వారా అబ్దుల్ ముఖీత్ చందా ఆదర్శంగా నిలిచారని కేటీఆర్ పేర్కొన్నారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ వంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఆర్థిక భరోసానివ్వడమే కాకుండా, తమ పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది పడే కుటుంబాల్లో ఆశను, ధైర్యాన్ని నింపుతాయని స్పష్టం చేశారు.