ఐపీవోలకు ఇన్వెస్టర్ల భారీ స్పందన
* మొబిక్విక్ ఆఫర్ 120 రెట్లు ఓవర్ సబ్‌స్క్రిప్షన్
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఫిన్‌టెక్ కంపెనీ ఒన్ మొబిక్విక్ సిస్టమ్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీవో) ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. ఆఫర్‌కు చివరిరోజైన శుక్రవారంనాటికి ఇష్యూ 119.38 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్ అయ్యింది. కంపెనీ 1,18,71,696 షేర్లను విక్రయానికి ఉంచగా, 1,41,72,65,686 షేర్లకు బిడ్స్ అందినట్లు స్టాక్ ఎక్సేంజీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాకు 135 రెటు స్పందన లభించగా, సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం 119 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయ్యింది. హైనెట్‌వర్త్ ఇన్వెస్టర్ల విభాగానికి 108 రెట్ల స్పందన వచ్చింది. రూ.572 కోట్ల సమీకరణకు వచ్చిన మొబిక్విక్ ఐపీవోకు రూ.265 ప్రైస్‌బ్యాండ్‌ను నిర్ణయించారు. కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.257 కోట్లు సమీకరించింది. మొబిక్విక్ డిజిటల్ క్రెడిట్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్సూరెన్స్ తదితర ఫైనాన్షియల్ సేవలు అందిస్తుంది.
విశాల్ మెగామార్ట్ ఆఫర్‌కు 27 రెట్లు స్పందన
రూ. 8,000 కోట్ల రిటైల్ చైన్ విశాల్ మెగామార్ట్ ఐపీవోకు సైతం ఇన్వెస్టర్లు జోరు గా బిడ్ చేశారు. ఆఫర్ ముగింపురోజైన శుక్రవారంనాటికి 27.28 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్ అయినట్లు ఎన్‌ఎస్‌ఈ గణాంకాలు వెల్లడించాయి. విశాల్ మెగామార్ట్ ఐపీవో ద్వారా రూ.8,000 కోట్లు సేకరించాలన్నది లక్ష్యంకాగా, ఆఫర్ మొత్తం ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూట్లో షేర్లను ఆఫర్ చేస్తున్నారు. ఎటువంటి తాజా ఈక్విటీ షేర్లనూ కంపెనీ జారీచేయదు. ఈ ఆఫర్‌కు రూ. 74 ప్రైస్‌బ్యాండ్‌ను నిర్ణయించారు. ఇప్పటికే కంపెనీ రూ. 2,400 కోట్లు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది.
ఇదేబాటలో సాయి లైఫ్ సైన్సెస్ ఆఫర్
శుక్రవారం ముగిసిన ఇతర ఐపీవోల తరహాలోనే హైదరాబాద్ కేంద్రంగా కార్యకలా పాలు నిర్వహిస్తున్న ఫార్మా కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్ ఆఫర్‌కు కూడా ఇన్వెస్టర్లు స్పందించారు. రూ.3,043 కోట్లు సమీకరణకు జారీచేసిన ఈ ఐపీవో 10.26 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్ అయినట్లు ఎన్‌ఎస్‌ఈ డేటాలో వెల్లడయ్యింది. రూ.552 ప్రైస్‌బ్యాండ్‌తో సాయి లైఫ్ సైన్సెస్ ఆఫర్ జారీచేసింది. ఆఫర్లో రూ.950 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ జారీ చేస్తుండగా, మరో 3.81 కోట్ల షేర్లను ప్రమోటర్, ప్రస్తుత షేర్‌హోల్డర్లు ఓఎఫ్‌ఎస్ మార్గంలో విక్రయిస్తున్నారు.




