10 April, 2026 | 8:57 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం విఫలం   •   ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ప్రత్యేక వైద్య శిబిరం   •   అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి   •   నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షుడిని సన్మానం   •   గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్   •   చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి   •   శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •  

సూపర్ రికవరీ

14-12-2024 12:15 AM

* 1200 పాయింట్ల నష్టం నుంచి వేగంగా కోలుకున్న సెన్సెక్స్

* 843 పాయింట్ల లాభంతో ముగింపు

* నిఫ్టీ కనిష్ట స్థాయి నుంచి 600 పాయింట్ల ర్యాలీ

* టెలికాం, టెక్ షేర్లలో భారీ కొనుగోళ్లు

ముంబై, డిసెంబర్ 13: ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలతో శుక్రవారం ఉదయం తీవ్ర క్షీణతను చవిచూసిన స్టాక్ సూచీలు నాటకీయంగా కనిష్ఠస్థాయి నుంచి పెద్ద ర్యాలీ జరిపాయి. అయితే మూడు రోజుల వరుస క్షీణతకు బ్రేక్‌వేస్తూ స్వల్ప లాభాలతో ముగిసాయి. టెలికాం, టెక్నాలజీ, కన్జూమర్ డ్యూరబుల్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో ఈ రికవరీ సాధ్యపడింది. ట్రేడింగ్ తొలిదశలో  సెన్సెక్స్ 1,207 పాయింట్లు పతనమై  80,082 పాయింట్ల కనిష్ఠస్థాయికి పడిపోయింది. అటుతర్వాత ఆ స్థాయి నుంచి శరవేగంగా 2,000 పాయింట్లకుపైగా పెరిగి కోలుకుని 82,213 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది.

చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 843 పాయింట్ల లాభంతో 82,133 పాయింట్ల వద్ద నిలిచింది.  ఇదేబాటలో  నిఫ్టీ తొలుత 24,180 పాయింట్ల కనిష్ఠస్థాయికి తగ్గిన తర్వాత అక్కడ్నుంచి 600 పాయింట్లుపైగా ర్యాలీ జరిపి 24,792 పాయింట్ల గరిష్ఠస్థాయిని చేరింది. చివరకు 219 పాయింట్ల లాభంతో 24,769 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 623 పాయింట్లు, నిఫ్టీ 90 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్ నష్టపోగా, సియోల్ లాభపడింది. యూరప్ సూచీలు గ్రీన్‌లో ముగిసాయి. 

ద్రవ్యోల్బణం తగ్గుదల ప్రభావం

దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కనిష్ఠస్థాయిల వద్ద హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో మార్కెట్  రికవరీ సాధ్యపడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ధరలు పెంచడంతో ఆ రంగం షేర్లకు మద్దతు లభించిందని, యూఎస్‌లో ఐటీ బడ్జెట్లు పెరుగుతాయన్న అంచనాలతో టెక్నాలజీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయని వివరించారు.

నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.48 శాతానికి తగ్గడంతో కనిష్ఠ స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఐటీ, టెలికాం షేర్లలో కొనుగోళ్లు జరిపారని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతం నుంచి 5.48 శాతానికి దిగిరావడంతో ఫిబ్రవరిలో రిజర్వ్‌బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న ఆశలు మార్కెట్ రికవరీకి కారణమని స్టాక్స్‌బాక్స్ టెక్నికల్ అనలిస్ట్ అమేయ రణదివే చెప్పారు.

ఎయిర్‌టెల్ టాపర్

సెన్సెక్స్ ప్యాక్‌లో అన్నింటికం టే అధికంగా భారతి ఎయిర్‌టెల్ 4.4 శాతం జంప్‌చేసి రూ.1,680 వద్ద ముగిసింది. ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనీలీవర్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్‌గ్రిడ్ షేర్లు 3 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు నష్టాలతో ముగిసాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ 2.13 శాతం పెరిగింది. కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 1.14 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 1.07 శాతం, బ్యాంకెక్స్ 0.81 శాతం, ఐటీ ఇండెక్స్ 0.57 శాతం చొప్పున లాభపడ్డాయి.

ఇండస్ట్రియల్స్ సూచి 0.40 శాతం, ఆటోమొబైల్స్ సూచి 0.37 శాతం, ఐటీ సూచి 0.35 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.34 శాతం చొప్పు న పెరిగాయి. మెటల్స్, ఇండస్ట్రియల్స్ సూచీలు నష్టపోయాయి. మార్కెట్ ట్రెండ్‌కు భిన్నంగా బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.29%, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.08% చొప్పున తగ్గాయి.