14 April, 2026 | 2:05 AM

ఆఫ్రికాలో ఆకలి కేకలు

19-08-2024 01:07 AM

డొక్కలెండిన 7 కోట్ల మంది 

నెర్రెలుబారిన నేలలు.. చుక్క నీరు కరువు

హరారే, ఆగస్టు 18: భూమిపై మొదటగా మనిషిని కన్న ఆఫ్రికాలో ఇప్పుడు అదే మనిషి ఆకలితో అలమటిస్తున్నాడు. పిడికెడు మెతుకులు దొరక్క, గుక్కెడు నీళ్లు కరువై డొక్కలెండి చావుకు దగ్గరవుతున్నా డు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఏ డు కోట్ల మంది ప్రజలు కరువు కోరల్లో చిక్కి విలవిలలాడుతున్నారని తాజా నివేదిక ఆం దోళన వ్యక్తంచేసింది. ఎల్‌నినో ప్రభావంతో కరువు కరాళనృత్యం చేస్తున్నదని సదరన్ ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ కమ్యూనిటీ (ఎస్‌ఏడీసీ) తెలిపింది. 16 దేశాలు సభ్యులుగా ఉ న్న ఈ కూటమి జింబాంబ్వే రాజధాని హరారేలో సమావేశమై కరువుపై చర్చించింది.  

ఆకలి అత్యవసర పరిస్థితి

కరువు మరింత తీవ్రం అవుతుండటంతో కొన్ని దేశాలు ప్రజలకు తిండి పెట్టలేక చేతులెత్తేసే పరిస్థితులు వచ్చాయి. జింబాంబ్వే, జాంబియా, మలావీ దేశాలు ఇప్పటికే ఆకలి అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. మానవతా సాయం చేయాలని ప్రపంచ దేశాలను లెసోతో, నమీబియా కోరాయి. కరువును ఎదుర్కొనేందుకు ఈ ప్రాంతానికి 5.5 బిలియన్ డాలర్ల సాయం అందించాలని ఎస్‌ఏడీసీ చైర్‌పర్సన్, అంగోలా అధ్యక్షుడు జోవో లోరెంకో అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.  

కరువు కోరల్లో 17 శాతం ప్రజలు 

ఎస్‌ఏడీసీ దేశాల్లోని మొత్తం జనాభాలో 17 శాతం మందికి తినటానికి తిండి, తాగటానికి నీళ్లు కూడా దొరకటం లేదని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఎలియాస్ మగోసీ తెలిపారు. దాదాపు 6.8 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది ప్రారంభం నుంచే వర్షాకాలంలో వానలు ముఖం చాటేశాయి. ఈ ప్రాంతంలోని చాలాచోట్ల కరువు తీవ్రంగా ఉన్నది. గత కొన్నేళ్లలో ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఇదే అత్యంత తీవ్రమైన కరువు.  వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరగటం కూడా ఇందుకు కారణం’ అని వివరించారు.