కమల కంటే నేనే బాగుంటా
రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
టైమ్ మ్యాగజైన్‌పై ఆమె ఫొటోలు వికారంగా ఉన్నాయని హేళన
వాషింగ్టన్ డీసీ(అమెరికా), ఆగస్టు 18: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఒకపార్టీ పై మరో పార్టీ నేతల విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమల హారిస్ కంటే తానే అందంగా ఉంటానని, ఆమెలాగే ఆమె నవ్వు కూడా వికారంగా ఉంటుందని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెన్సెల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ.. కమలా హారిస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కమల హారిస్ నవ్వితే చూడ్డానికి వికారంగా ఉంటుందని బహుశా ఆమె అందుకే ఎల్లప్పుడూ నోరు మూసుకొని ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇటీవల టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కమల ఫొటోలు ప్రచురితం కావడాన్ని జీర్ణించుకోలేని ట్రంప్ వాటిపైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ‘కమల ఫొటోలు సరిగా లేకపోవడంతో టైమ్ మ్యాగజైన్ వాళ్లు స్కెచ్ ఆర్టిస్టును హైర్ చేసుకున్నారు’ అని వ్యంగ్యంగా మాట్లాడారు. కమల మాటల్లో ఎక్కువగా అబద్ధాలు ఉంటాయని, ఆమె మార్క్సిస్ట్ పాలసీలను అనుసరిస్తారని విమర్శించారు. అమెరికా కలలను జోబైడెన్, హారిస్ చంపేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ‘అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్’ అనే నినాదానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని అన్నారు. అమెరికా యువతకు ఉద్యోగాలు కల్పించడమే తన లక్ష్యమని ట్రంప్ వెల్లడించారు.




