లేటరల్ ఎంట్రీ.. రిజర్వేషన్లపై దాడే
- కేంద్ర శాఖల్లో కార్పొరేట్ ప్రతినిధుల నియామకానికి యూపీఎస్సీ నోటిఫికేషన్
- ప్రభుత్వ తీరును తప్పుపట్టిన రాహుల్ గాంధీ
న్యూ ఢిల్లీ, ఆగస్టు 18: ప్రభుత్వ శాఖల్లో లేటరల్ ఎంట్రీ పద్ధతిలో నియామకాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీఎస్సీకి బదులుగా ప్రత్యామ్నా య మార్గంలో నియామకాలు చేపట్టడం అంటే రాజ్యాంగంపై దాడి చేయడమే అని కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. లేటరల్ ఎంట్రీ పద్ధతిలో 45 మంది సంయుక్త కార్యదర్శులు, ఉప కార్యదర్శుల నియామకానికి యూపీఎస్సీ ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించిడాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్‌లో రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు.
‘ కేంద్ర శాఖల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా నియామకాలు చేపడుతూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల రిజర్వేషన్లపై దాడి చేసేందుకు ఎన్డీఏ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉన్నత స్థానాల్లో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం దక్కడం లేదు. దీనికి తోడు లేటరల్ ఎంట్రీ ద్వారా వారిని ఆ పదవులకు దూరం చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో కీలకమైన కార్య దర్శుల పోస్టులను లేటరల్ ఎంట్రీ పద్ధతిలో కార్పొరేట్ సంస్థల ప్రతినిధులకు కట్టబెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ విధమైన భర్తీని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది’ అని రాహుల్ స్పష్టం చేశారు. ఈ విధమైన భర్తీ ద్వారా కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ప్రభుత్వ శాఖల్లో చేరి ఎం చేస్తారనే దానికి ప్రధాన ఉదాహరణ ‘సెబీ’నే అని కేంద్రానికి చురకలంటించారు రాహుల్.
అసలేంటి ఈ ‘లేటరల్ ఎంట్రీ’?
ప్రభుత్వ శాఖల్లో కార్యదర్శులుగా, సంయుక్త, ఉప కార్యదర్శులుగా, డైరెక్టర్లుగా ప్రైవేట్ రంగంలోని ప్రతిభావంతులను నియమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలసిందే. సాధారణంగా ఈ నాలుగు అత్యున్నత స్థాయి పోస్టులను సీనియారిటీ, ప్రతిభ గల ఐఏఎస్ అధికారులను, గ్రూప్ ఏ స్థాయి అధికారులతో భర్తీ చేస్తారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం మాంత్రం కాంట్రాక్టు పద్ధతిలో కార్పొరేట్ సంస్థల ప్రతినిధులకు ఆయా పోస్టులను కట్టబెట్టేందుకు చూస్తోంది అనేది ప్రతిపక్షం ప్రధాన వాదన.




