14 May, 2026 | 1:43 AM

అనుమానంతో భార్య కాలు నరికిన భర్త

14-05-2026 12:45 AM
  1. ఆమె పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు
  2. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  3. చౌటకూర్ మండలం గంగోజిపేటలో ఘటన

చౌటకూర్(సంగారెడ్డి), మే 13(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం గంగోజిపేటలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భర్త భార్యపై అత్యంత కిరాతకంగా దాడి చేసి, ఆమె కాళ్లను నరికివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గయ్య గత కొంతకాలంగా తన భార్య వీరమణి ప్రవర్తనపై తీవ్రమైన అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

మంగళవారం భార్యాభర్తల మధ్య మరోసారి తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన దుర్గయ్య ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై గొడ్డలి తీసుకుని విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె పారిపోకుండా ఉండేందుకు కాలును దారుణంగా నరికివేసి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావమై, అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం అత్యవసరంగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. బుధవారం దుర్గయ్య కొడుకు హరీష్  ఫిర్యాదు మేరకు చౌటకూర్ పోలీసులు నిందితుడినిఅదుపులోకి తీసుకుని, దుర్గేష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.