12 June, 2026 | 2:09 AM

హుస్నాబాద్ బస్ స్టేషన్ ముంపు సమస్య

12-06-2026 12:26 AM
  1. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ
  2. ఆర్టీసీ ఎండీ తో కల్సి పరిశీలన మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, జూన్ 11: హుస్నాబాద్ బ స్ స్టేషన్లో ప్రతి వర్షాకాలంలో ఎదురవుతు న్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీ సీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి బస్ స్టేషన్ను పరిశీలించిన మంత్రి, ప్రయాణికులతో నేరు గా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. భారీ వర్షాల సమయంలో బస్ స్టేషన్లో నీరు నిల్వ ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన మంత్రి, బస్ స్టేషన్ వెనుక ఉన్న నాలాను ప్రధాన డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానం చేసే విధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

రోజుకు సుమారు 35 వేల మంది ప్రయాణికులు వినియోగిస్తున్న హుస్నాబాద్ బస్ స్టేషన్ రాష్ట్రంలోనే ఆదాయం పరంగా ప్రముఖ ఏ-క్లాస్ కమర్షియల్ బస్ స్టేషన్లలో ఒకటని మంత్రి పేర్కొన్నారు. పట్టణ విస్తరణ, విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీలు, పారిశ్రామిక కారిడార్ అభివృద్ధితో హుస్నాబాద్ ప్రాధాన్యం మరింత పెరుగుతోందని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని బస్ స్టేషన్ను ఆధునిక వసతులతో అభివృద్ధి చేయడంతో పాటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.

ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ, మంత్రి సూచనల మేరకు ముంపు సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని, భవిష్యత్తులో హుస్నాబాద్ బస్ స్టేషన్ను ఆధునికీకరించి షాపింగ్ మాల్ను తలపించే స్థాయికి అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వర్షాకాల ముంపు సమస్య పరిష్కారంతో పాటు ఆధునికీకరణ పనులు వేగం పుంజుకుంటే హుస్నాబాద్ బస్ స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.